Heli Tourism Rides: దసరా మహోత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. శరన్నవరాత్రుల్ని పురస్కరించుకుని విజయవాడలో హెలీ టూరిజం ఏర్పాటు కానుంది. హెలీ టూరిజం ఎప్పట్నించి, ఎలా అందుబాటులో ఉంటుందనేది తెలుసుకుందాం.
రేపట్నించి రాష్ట్రంలో దసరా(Dussehra) సందడి ప్రారంభం కానుంది. 9 రోజులపాటు సాగే దసరా శరన్నవరాత్రుల మహోత్సవాల్ని వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేస్తోంది. 3 వేలమంది పోలీసులు, సీసీ కెమేరాల పర్యవేక్షణలో దసరా ఉత్సవాల్ని కట్టుదిట్టంగా నిర్వహించనుంది. ఈ దసరాకు మరో ప్రత్యేక ఆకర్షణ తీసుకురానున్నాయి. పర్యాటకులు, సందర్శకుల కోసం కొత్తగా హెలీ టూరిజం ప్రారంభించబోతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆకాశంలో విహరిస్తూ నగర అందాల్ని, దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో జరిగే ఉత్సవాల్ని పైనుంచి వీక్షించే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి 15 వ తేదీ వరకూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల వీక్షణ కోసం హెలీ రైడ్స్ ఏర్పాటయ్యాయి. రేపట్నించి ప్రారంభం కానున్న హెలీ రైడ్స్‌ను(Heli Rides)రాష్ట్ర పర్యాటక శాఖ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. దసరాకు పెద్దఎత్తున భక్తులు, పర్యాటకులు రానున్న నేపధ్యంలో హెలీ టూరిజంకు మంచి ఆదరణ లభిస్తుందని అంచనా ఉంది. కృష్ణా నది తీరాన హెలీప్యాడ్ ఏర్పాటుకు వీఎంసీ అధికారులు సన్నాహాలు చేశారు. హెలీ టూరిజం మొదటిసారిగా విజయవాడలో అందుబాటులో రానుంది.
రెండు కేటగరీల్లో టికెట్ ధరలు
కృష్ణానదిపై (Krishna River)నుంచి విహరిస్తూ నది అందాలతో పాటు మబ్బుల చాటు నుంచి ఇంద్రకీలాద్రి వైభవం, విజయవాడ నగర సోయగాల్ని వీక్షించేలా ప్రాజెక్టు రూపొందించారు. దీనికోసం తుంబై ఏవియేషన్ సంస్థ ఆరుగురు ప్రయాణీకులు ఒకేసారి ప్రయాణించేలా సింగిల్ ఇంజన్ ఛాపర్ ఏర్పాటు చేసింది. రెండు కేటగరీల్లో టికెట్ ఉంటుంది. ఆకాశం నుంచి ఇంద్రకీలాద్రి మీదుగా ప్రకాశం బ్యారేజ్, నగర అందాల్ని వీక్షించేందుకు 6-7 నిమిషాలకు 3 వేల 5 వందలుగా టికెట్ నిర్ణయించారు. ఇక దుర్గగుడి ఏరియల్ వ్యూ, నగరంలోని హిల్స్ అందాల్ని వీక్షించేందుకు 15 నిమిషాలకు 6 వేలరూపాయలుగా టికెట్ ఉంటుంది. ఫ్లై జాయ్ ప్రొమోషన్ కోసం సామాజిక మాధ్యమాల వేదికగా విస్తృత ప్రచారం కల్పించనున్నారు. టికెట్ బుకింగ్ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌తో పాటు ఆఫ్‌లైన్ కౌంటర్లు కూడా ఉంటాయి. రాష్ట్రంలో పర్యాటకాన్ని విస్తరించి, ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నారు. విజయవాడలో హెలీ టూరిజం(Heli Tourism) ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
Also read: AP Weather updates: కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు, రేపు భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook