ప్రముఖ టీడీపీ నేత వసంత నాగేశ్వరావు, తన కుమారుడు వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి గురువారం వైఎస్సార్ సీపీ పార్టీలో అధికారికంగా చేరారు. కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వసంత నాగేశ్వరరావు పార్టీలో చేరారు. వసంత నాగేశ్వరరావు గతంలో మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రిగా, వ్యవసాయశాఖా మంత్రిగా, హోం మంత్రిగా, ఆప్కాబ్ ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు.
జై ఆంధ్ర ఉద్యమ నాయకులుగా కూడా ఆయన సుపరిచితులు. 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారు. అలాగే ఆయన గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బ తినక ముందే అన్నదమ్ముల్లా విడిపోవటం మంచిదని తెలిపారు.
1999 ఎన్నికల్లో నందిగామ నుండి పోటీ చేసిన వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికలలో గుంటూరు 2 స్థానం నుండి ఆయన టీడీపీ తరఫున బరిలోకి దిగాలని భావించారు.కానీ, టికెట్ దక్కలేదు. తాజాగా కృష్ణప్రసాద్ పార్టీలోకి వస్తే.. వైసీపీ అధినేత జగన్ తగిన ప్రోత్సాహం ఇస్తానని తెలిపారని, అంతేకాకుండా మైలవరం అసెంబ్లీ టికెట్‌ను సైతం ఆయనకు రిజర్వ్ చేసినట్లు తెలిపారని కొందరు అంటున్నారు.