Telugu Desam Janasena : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చాలా మంది వైసీపీ నేతలు సైలెంట్ గా మారారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో తెగ హంగామా చేసిన నేతలు ఇప్పుడు గప్ చుప్ గా మారారు. కొందరు వైసీపీ నేతలు వేచిచూసే ధోరణిలో ఉంటే మరి కొందరు మాత్రం భవిష్యత్తు రాజకీయాలపై తెగ ఆలోచన చేస్తున్నారు. అలాంటి నేతలకు ఇప్పుడు జనసేన అనేది ఒక వరంగా మారింది. వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు తొందరలోనే పార్టీనీ వీడటానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పార్టీలో చేరడానికి తెగ రాయబారాలు నడిపిస్తున్నారని సమాచారం. కొందరు నేతలైతే ఏకంగా మెగస్టార్ చిరంజీవితో రెకమెండేషన్లు కూడా చేయించుకుంటున్నారని జనసేన సర్కిల్ లో గుసగుసలు వినపడుతున్నాయి.అన్నీ అనుకున్నట్లు కుదిరితే అతి కొద్ది రోజుల్లోనే కొందరు కీలక నేతలు జనసేన కండువా కప్పుకోవడం ఖాయంగా కనపడుతుందని ఏపీ పాలిటిక్స్ టాక్ నడుస్తోంది.
ఇప్పటికే జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభానులాంటి నేతలు కొద్ది రోజుల క్రితమే కండువా మార్చేశారు.మరి కొందరు కూడా అదే దారిలో నడవబోతున్నట్లు వినికిడి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా తాము సేఫ్ జోన్ లో ఉండాలనుకుంటే జనసేన ఒక్కడే దిక్కు అని పార్టీ మారతున్న వైసీపీ నేతలు భావిస్తున్నారట.జనసేనలో ఉంటే ఇటు వ్యక్తిగతంగాను, అటు రాజకీయంగాను ఇబ్బందులు ఉండవని పై పెచ్చు అదృష్షం కలిసి వస్తే పదవి యోగం కూడా దక్కవచ్చనేది నేతల ఆలోచనట.అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే పార్టీ మారుతున్నారట. గతంలో వైసీపీ ప్రభుత్వంలో తమ వల్ల ఇబ్బందులు పడ్డ టీడీపీ నేతలు టార్గెట్ చేసే అవకాశం ఉన్నందున జనసేనలో చేరడమే కరెక్ట్ అని మెజార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో పాటు జనసేనలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఆ పార్టీలోకి వెళితే రాజకీయంగా చాలా ప్రయోజనాలు ఉంటాయని నేతలు అనుకుంటున్నారు.అందుకే జనసేన వైపు వైసీపీ నేతలు చూస్తున్నారని రాజకీయ పరిశీలకుల అంచనా.
ఇది ఇలా ఉంటే చేరికల విషయంలో మాత్రం టీడీపీ కొంత కలవరపడుతుందని సమాచారం. వైసీపీలోని ముఖ్య నేతలు జనసేనలో చేరితే జనసేన క్రమంగా రాజకీయంగా బలోపేతం అవుతుంది. తద్వార భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు వస్తాయా అన్న చర్చ టీడీపీ క్యాడర్ లో జరుగుతుంది. ముఖ్యంగా మొన్నటి ఎన్నికల వరకు వైసీపీలో ఉన్న నేతలతో మెజార్టీ నియోజకవర్గాల్లో టీడీపీ కసిగా పోరాడింది. ఇప్పుడు అలాంటి నేతలే జనసేనలో చేరితే అప్పుడు రాజకీయాలు ఎలా ఉండబోతాయి అని టీడీపీలో చర్చ జరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు తమను వేధించిన నేతలు జనసేనలో చేర్చుకోవడం కరెక్టు కాదని టీడీపీలోని కొందరి నేతల భావన. తమను ఇబ్బంది పెట్టిన నేతలే ఇప్పుడు జనసేనలో కాలర్ ఎగిరేస్తూ ఉండడం తెలుగు తమ్ముళ్లు అస్సలు తట్టుకోలేకపోతున్నారట.
ఏదేని పరిస్థితుల్లో రాజకీయ సమీకరణాలు మారితే దానికి ఇలా వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన నేతలే కారణమవుతారని టీడీపీ నేతలు అనుకుంటున్నారట. ప్రస్తుతానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు నేతలు కూటమిని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీనీ ఇబ్బందిపెట్టిన నేతలను జనసేనలో చేర్చుకుంటే క్యారడ్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అకవాశం లేకపోలేదని టీడీపీలో జరుగుతున్న చర్చ. ఇదే జరిగితే కూటమిలో అభిప్రాయబేధాలకు కారణం అవుతుందని లోలోన టీడీపీలో వినిపిస్తున్న టాక్. అలాంటిది జరగకుండా ఉండాలంటే జనసేన అధినేత వైసీపీ నుంచి వచ్చే నేతల విషయంలో కాస్తా పునరాలోచన చేయాలని పవన్ కు సూచన చేస్తున్నారు. అసలే కొందరు అవకాశం దొరికితే కూటమిలో చిచ్చే రేపే ప్రయత్నాలు చేస్తున్నారు . అలాంటి వారికి మనం తెలిసి తెలిసి అవకాశం ఇవ్వకూడదు అనేది తెలుగుదేశం భావన.
ఐతే టీడీపీ నుంచి వస్తున్న సూచనలను జనసేనాని ఎలా తీసుకుంటారు. వైసీపీ నుంచి వస్తున్న వారందరిని పార్టీలో చేర్చుకుంటారా లేక ఆయా నియోజకవర్గ పరిస్థితులను బట్టి పవన్ నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ జనసేనలో జరుగుతుంది. చాలా మంది నేతలు జనసేనలో చేరడానికి సుముఖత చూపిస్తున్నారు కానీ జనసేన అధినేత మాత్రం కొందరి విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. వైసీపీలో ఉన్నప్పుడు పవన్ ను , జనసేనను ఇష్టం వచ్చినట్లు విమర్శించిన నేతలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జనసైనికుల నుంచి వినబడుతున్న మాట. అలాంటి వారిని తీసుకుంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని కొందరు నేతలు పవన్ కు చెబుతున్నారట. తాజాగా గతంలో జనసేన పార్టీకీ చెందిన ఏకైక ఏమ్మెల్యే రాపాక వరప్రసాద్ అధికార వైసీపీలో చేరాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమితో తిరిగి సొంత గూటికి చేరాలనుకుంటున్నారు. దీనిని కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాపాక వరప్రసాద్ పట్లనే క్యాడర్ ఇంత సీరియస్ గా ఉంటే ఇక వైసీపీ నుంచి వస్తున్న నేతల పట్ల ఎలా రియాక్ట్ అవుతారో అని జనసేన ముఖ్య నేతల్లో జరుగుతున్న చర్చ.
మొత్తానికి జనసేనలో చేరికల అంశం ఇప్పుడు ఇటు టీడీపీతో పాటు అటు జనసేనలో కూడా ఆందోళనను కలిగిస్తుంది. చేరికల విషయంలో అధినేత పవన్ దే తుది నిర్ణయం అని పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా పని చేయడమే జనసైనికుల విధి అని జనసేన పార్టీ చెబుతుంది. ఇక ఈ చేరికల అంశం భవిష్యత్తులో ఏపీలో ఏదైనా రాజకీయ సమీకరణాలకు కారణం అవుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter