బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని బయటికి వచ్చిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరికి మధ్య రాజ్యసభ లాబీలో వాగ్వాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని మొరపెట్టుకుంటూ ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో నిరంతరంగా నిరసన చెబుతున్న టీడీపీ ఎంపీల గురించి సుజనా చౌదరితో మాట్లాడుతూ.. రెండుసార్లు సభలో ప్రకటన చేసినా సభ్యులు సంతృప్తి చెందకపోతే ఎలా అని జైట్లీ ప్రశ్నించినట్టు సమాచారం. అయితే, జైట్లీ ప్రశ్నకు స్పందించిన సుజనా చౌదరి.. కేవలం ప్రకటనలతో ఏపీ ప్రజలని ఇక మభ్య పెట్టలేరని బదులివ్వడంతో ఇరువురి మధ్య పరస్పర వాదన చోటుచేసుకుందని మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి.
ఏపీకి అన్యాయంపై జైట్లీతో వాదనకు దిగిన సుజనా చౌదరి.. రాజకీయ పార్టీలు ఉంటాయి పోతాయి. కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మాత్రం నెరవేర్చాలని, ప్రభుత్వం శాశ్వతం కానీ... రాజకీయ పార్టీలు కాదని అన్నారని అక్కడే వున్న మీడియా మిత్రులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా సుజనా చౌదరి బదులు ఇచ్చిన తీరుపై అరుణ్‌జైట్లీ కొంత ఆవేదనకు గురయ్యారనే టాక్ కూడా వినిపిస్తోంది.