Economically Weaker Section(Ews): ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం తీసుకొచ్చే పథకాలపై చాలా మందికి అవగాహన ఉండకపోవడం వల్ల అర్హులకు అవి చేరువకావడం లేదనేది నిపుణుల మాట. రిజర్వేషన్లది కూడా అదే పరిస్థితి. ప్రజాప్రతినిథుల ప్రాపకం, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగడం వంటి వాటికి అలవాటైన జనం తమకు అందాల్సిన వాటిపై చైతన్యం కాకపోవడం.. ఆ దిశగా అటు ప్రజాప్రతినిధుల, ఇటు అధికారం యంత్రాంగం ప్రయత్నాలు కూడా అంతగా లేకపోవడం గమనార్హం. దీనివల్ల అగ్రవర్ణ బడుగు జీవులు.. ప్రధానంగా విద్యార్థులు, ఉద్యోగార్థులు నష్టపోతున్నారు. పేదలు ఒక వర్గానికో.. ఒక వర్ణానికో పరిమితం కాదు. అగ్రవర్ణాల్లో కూడా కటికపేదలు ఉన్నారు.
వీళ్లకు సామాజిక న్యాయం చేయడానికి తీసుకొచ్చిందే ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్. ఇది అమల్లోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ చాలామంది అగ్రవర్ణాల పేద విద్యార్థులకు, ఉద్యోగార్థులకు దీనిపై అవగాహన తక్కువే. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 2019లోకేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషను తీసుకొచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉపాధి రంగాల్లో 10శాతం ఈడబ్లుఎస్ రిజర్వేషన్లుచట్టబద్ధమే అని సుప్రీంకోర్టు గత నెలలో తీర్పు కూడా ఇచ్చింది. అయితే, ఇప్పటికే అగ్రవర్ణ పేదలు లబ్ధి పొందుతున్నా.. చాలామందికి ఈ రిజర్వేషను అందడం లేదనే చెప్పొచ్చు. ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అమల్లో ఉండడం వల్ల.. ఈడబ్ల్యుఎస్ ని ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు వరంగా చెప్పొచ్చు. అసలు ఈడబ్ల్యుఎస్ అంటే ఏమిటి?.. ధ్రువపత్రం ఎలా పొందాలి? తదితర వివరాలు చూద్దాం.
1) EWS అంటే ఏమిటి ?.. ఎవరికి వర్తిస్తుంది?..
జ) ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు. కేంద్ర ప్రభుత్వం OC కేటగిరీలోని.. అగ్రవర్ణాలలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారికి విద్యా, ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కల్పించింది.
2) EWS వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి ?
జ) కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే అన్ని కళాశాలల్లో 10% సీట్లు,కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే అన్ని ఉద్యోగాలలో 10% కేటాయిస్తారు.
3) రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయా?
జ) ఏపీ, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు ఈడబ్ల్యుఎస్ అమలు చేస్తున్నాయి. విద్యలో, ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి.
3) EWS రిజర్వేషన్ పొందడానికి కావలసిన అర్హతలు ఏమిటి ?
జ) కుటుంబ ఆదాయం 8 లక్షలు, వ్యవసాయ భూమి 5 ఎకరాలు లేదా ఆ లోపు, ఇల్లు 1000 చదరపు అడుగులలో.. నోటిఫై చేసిన మున్సిపల్ ఏరియాలో స్థలం 100 చదరపు గజాలలోపు, రూరల్ ఏరియాలో స్ధలం ఉంటే అది 200 చదరపు గజాలలోపు ఉండాలి.
4) EWS కి ఎలా అప్లై చేయాలి ?
జ) నోటరీ దగ్గరికి వెళ్తే వారి వద్ద అఫిడవిట్ నమూనా ఉంటుంది. ఆ విధంగా నోటరీ చేయించుకోవాలి. ఆధార్ కార్డు తీసుకెళ్లడం మరువొద్దు. ఒరిజనల్ నోటరీతో పాటు.. అభ్యర్ధి ఆధార్ జెరాక్స్ ,ఓ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయం తెలిపే ఆధారం, రేషన్ కార్డు జిరాక్సు తీసుకుని మీ సేవ ఆఫీసు/సచివాలయం కు వెళ్ళండి.అక్కడ వారు ఓ అప్లికేషన్ ఇస్తారు.దానిపై సంతకం చేసే మీ దగ్గర ఉన్న పేపర్లు అన్ని ఇస్తే సరిపోతుంది.
5) EWS సర్టిఫికేట్ కాల పరిమితి ఎంత ?
జ) EWS సర్టిఫికేట్ కాల పరిమితి ఒక సంవత్సరం (ఏప్రియల్ నుండి మార్చి వరకు)మాత్రమే. గడువు తీరిపోతే మళ్లీ ప్రక్రియ మామూలే. ఉదాహరణకు.. 2021-22 ఆర్థిక సంవత్సరంలోని ఆదాయం బట్టి ఇచ్చిన సర్టిఫికేట్ కాల పరిమితి 2022 ఏప్రియల్ నుండి 2023మార్చి వరకు ఉంటుంది.
6) కుటుంబం అంతటికి ఒక EWS సర్టిఫికేట్ సరిపోతుందా ?
జ) సరిపోదు. విద్య,ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న కుటుంబం లో వారందరూ విడివిడిగా సర్టిఫికెట్ తీసుకోవాలి.
7) సర్టిఫికెట్ జారీలో ఇబ్బంది కలిగితే?
జ) నిబంధనల ప్రకారం అన్ని పత్రాలూ అందజేసినా సర్టిఫికెట్ జారీలో ఇబ్బంది కలిగితే ఎమ్మార్వో, ఆర్డీవో, సబ్ కలెక్టర్, కలెక్టర్ని కలిసి విషయం తెలియజేయవచ్చు. లేదా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి రశీదు పొందవచ్చు.
Also Read : Ma Bava Manobhavalu : మా బావ మనోభావాలు.. దుమ్ములేపిన బాలయ్య.. దరువేసిన తమన్
Also Read : Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook