మీవద్ద మంచి సినిమా కథలున్నాయా.. మంచి స్క్రిప్ట్ రాయగల సత్తా మీకుందా..? అయితే ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ‘సినీస్థాన్ ఇండియాస్ స్టోరీ టెల్లర్స్ స్క్రిప్ట్ కాంటెస్ట్’కు సిద్ధమైపోండి. ఎందుకంటే.. ఎవరూ టచ్ చేయలేని వినూత్న అంశాలతో స్క్రిప్ట్స్ రాసేవారికి సినిస్థాన్ వారు రూ.50 లక్షల రూపాయల బహుమతిని ప్రకటించారు. ఈ పోటీలను ఇటీవలే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఇందులో భాగంగా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కూడా జరుగుతోంది.
కాకపోతే స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ లేదా ఇతర సంస్థల్లో రిజిస్టర్ అయిన స్క్రిప్ట్స్ మాత్రమే ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హతను పొందుతాయని నిర్వాహకులు తెలపడం జరిగింది. స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ సంస్థలో రిజిస్టర్ చేసుకోవడానికి www.swaindia.org/membership వెబ్ సైటును సందర్శించవచ్చు. సినిమా ప్రముఖులు, రచయితలతో పాటు స్క్రిప్ట్ రైటింగ్ పట్ల ఆసక్తి ఉన్నవారు కూడా ఈ అసోసియేషన్‌లో ఫెల్లో మెంబర్స్‌గా చేరవచ్చు. ప్రస్తుతం సినిస్థాన్ వారు నిర్వహిస్తున్న పోటీలో ప్రముఖ దర్శకుడు రాజు హిరాణీ కూడా భాగస్వాములవ్వడం విశేషం.
ఈ పోటీకి దరఖాస్తులు పంపించడానికి ఆఖరు తేది: జనవరి 22, 2019. దరఖాస్తు ఖరీదు రూ.1500. ఈ కాంటెస్టుకి షార్ట్ లిస్టు అయిన అభ్యర్థులు రెండవ రౌండ్లో పూర్తి స్క్రిప్ట్‌ని అందజేయాల్సి ఉంటుంది. ఆ వివరాలకు https://scriptcontest.cinestaan.com/ వెబ్ సైటును సందర్శించవచ్చు. ఈ సారి ఈ కాంటెస్టుకి జ్యూరీ మెంబర్లుగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌తో పాటు రాజ్ కుమార్ హిరాణీ, జుహీ చతుర్వేది, అంజుమ్ రాజాబలి సేవలందిస్తున్నారు. ఈ పోటీ మొత్తం ప్రైజ్ మనీ రూ.50 లక్షలు కాగా.. ఉత్తమ స్క్రిప్ట్‌కి ప్రత్యేకంగా రూ.25 లక్షలు అందివ్వనున్నారు.