థియోటర్స్ లో అదరగొడుతున్న ' ఓ బేబీ '

ఈ రోజు థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకుల్ని బేబీ డిసప్పాయింట్ చేయలేదు..తన ఫెర్ఫార్మెన్స్ లో అదరగొట్టేసింది

Last Updated : Jul 5, 2019, 09:19 PM IST

కమర్షియల్ హీరోయిన్ గా నటించడం మానేసి, ఫిమేల్ ఓరియంటెండ్ మూవీస్ వైపు మళ్లిన సమంత.. చాలా ఆశలు పెట్టుకొని చేసిన సినిమా ఓ బేబీ. తనంతట తానే ఎంతో ఇష్టపడి సెలక్ట్ చేసుకున్న ఈ రీమేక్ సబ్జెక్ట్ ఆమెకు కలిసొచ్చిందా..? ఓ బేబీ రిజల్ట్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే వివరాల్లో వెళ్లాల్సిందే మరి..
 

కథ:
చిన్న వయసుకే భర్తను కోల్పోయి చిన్న బాబుతో చాలా ఇబ్బందులు పడుతుంది బేబి (సమంత). చాలా కష్టపడి కొడుకు నాని (రావు రమేష్)ని పెంచి పెద్ద చేస్తుంది. అయితే బేబి చాదస్తం, అతి మంచితనం, డామినేషన్ కారణంగా నాని భార్య ఇబ్బందిపడుతుంది. ఒక దశలో అనారోగ్యానికి గురవుతుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకును
వదిలి బయటకు వచ్చేస్తుంది బేబి.
మనవడి మ్యూజిక్ షో చూసేందుకు వెళ్లిన బేబి, దేవుడి దయతో తిరిగి తన యవ్వనాన్ని తెచ్చుకుంటుంది. 70 ఏళ్ల బామ్మ కాస్తా 24 ఏళ్ల పడుచుపిల్లగా మారిపోయింది. యవ్వనంగా మారిన బేబి తన జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేసింది. కొడుకు కాపురాన్ని ఎలా చక్కదిద్దింది. మనవడ్ని ఎలా గెలిపించింది.. ఫైనల్ గా బేబి ఏమైంది అనేది ఈ సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు
సినిమా మొత్తం సమంత మాత్రమే కనిపిస్తుంది. అది కూడా స్టార్ లా కాదు, సమంతలో ఓ నటి కనిపిస్తుంది. ఇంతకు ముందు సమంత తన కెరీర్ లో ఎన్నో పాత్రలు చేసింది కానీ…. ఈ బేబీ పాత్ర మాత్రం చాలా ప్రత్యేకం. ప్రతి సీన్లో తన ఎనర్జీ ఏ మాత్రం తగ్గకుండా మెయింటైన్ చేసింది సమంత. ముఖ్యంగా ఎమోషనల్ సీన్ల లో సమంత నటన చాలా
బాగుంది.

ఇతర నటీనటుల నుంచి సమంతకు పూర్తి సహకారం లభించింది. నాని పాత్రలో రావు రమేష్, చంటిగా రాజేంద్రప్రసాద్ బ్రహ్మాండంగా నటించారు. వీళ్లకు తోడు లక్ష్మి గురించి ఎంత చెప్పినా తక్కువే. బేబి పాత్ర కోసం ఆమె ది బెస్ట్ ఇచ్చారు. ఈ 4 పాత్రలు పండడంతో ఓ బేబీ సినిమా ఈజీగా పాస్ అయిపోయింది. వీళ్లతో పాటు నాగశౌర్య, తేజ, ప్రగతి, జగపతిబాబు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. క్లైమాక్స్ లో వచ్చిన నాగచైతన్య కూడా ఓ మెరుపు మెరిపించాడు.

టెక్నీషియన్స్ పనితీరు
ముందుగా నందినీరెడ్డి, లక్ష్మీభూపాల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్లిద్దరూ కలిసి చేసిన మార్పులు సినిమాకు ప్లస్ అయ్యాయి. మరీ ముఖ్యంగా లీడ్ క్యారెక్టర్ కు గోదావరి యాస పెట్టాలనే ఆలోచన అద్భుతం. కంప్లీట్ గా నేటివిటీ ఫీలింగ్ తెప్పించింది ఈ మార్పు. దర్శకురాలిగా నందినీరెడ్డి చాన్నాళ్ల తర్వాత మెరిసింది. రీమేక్స్ ను బాగా హ్యాండిల్ చేయగలదనే ఇమేజ్ తెచ్చుకుంది. అటు లక్ష్మీభూపాల్ కూడా తన డైలాగ్స్ తో సినిమాకు ప్లస్ అయ్యారు.

రిచర్డ్ ప్రసాద్ కెమెరా వర్క్ బాగుంది. వివిధ మూడ్స్ కు తగ్గట్టు అతడు సెట్ చేసిన లైటింగ్ చాలా బాగుంది. సమంత దగ్గరకు దేవుడొచ్చిన సీన్, 50 ఏళ్ల కిందట సమంతపై తీసిన సన్నివేశాలు, సాంగ్స్ లో సినిమాటోగ్రాఫర్ వర్క్ కనిపిస్తుంది. మ్యూజిక్ డైరక్టర్ మిక్కీ జే మేయర్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. జునైద్ ఎడిటింగ్,
విఠల్ ఆర్ట్ వర్క్ బాగున్నాయి. సురేష్ బాబు, విశ్వప్రసాద్ కలిసి నిర్మించిన ఈ సినిమా ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీపడలేదు.

మూవీ రివ్యూ
కొన్ని కథలు కొందరికే సూట్ అవుతాయి. అలాంటి కథల్ని వెతికి పట్టుకోవడంలోనే అసలైన టాలెంట్ దాగి ఉంటుంది. ఈ టాలెంట్ సమంతకు పుష్కలంగా ఉంది. మిస్ గ్రానీ అనే కొరియన్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను స్వయంగా సమంత సెలక్ట్ చేసుకుంది. దాన్ని నందినీరెడ్డి చేతిలో పెట్టింది. మనసుకు నచ్చిన కథ కావడంతో
పెర్ఫార్మెన్స్ ఇరగదీసింది. అందుకే ఓ బేబీ సినిమా అందరికీ అంత బాగా నచ్చింది.

ఈ సినిమాకు సంబంధించి వన్ మ్యాన్ ఆర్మీ అనే పదం సమంతకు అతికినట్టు సరిపోతుంది. యంగ్ గా కనిపిస్తూనే, ఓల్డేజ్ మాటలు మాట్లాడడం, ఆ మేనరిజమ్స్ చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయింది. డైలాగ్స్ కూడా పెర్ ఫెక్ట్ గా సింక్ అవ్వడంతో సిల్వర్ స్క్రీన్ పై బేబీ జీవం పోసుకుంది. తన కెరీర్ లో కొన్ని మంచి పాత్రలు చేసింది సమంత. కానీ బేబీ క్యారెక్టర్ మాత్రం ఆమె కెరీర్ బెస్ట్. భవిష్యత్తులో మళ్లీ ఇంత పాత్ర సమంతకు దొరకదేమో.

ఈ మూవీలో సమంత ఓ స్టార్ గా కంటే, నటిగా ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె యాక్టింగ్ ఆ రేంజ్ లో ఉంది. రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలతో పాటు, క్లయిమాక్స్ లో రావ్ రమేష్ తో వచ్చే సీన్స్ ఆడియన్స్ కు గుర్తుండిపోతాయి. వీటితో పాటు సమంత కామెడీ టైమింగ్ కూడా అదిరిపోయింది. ఇలా రివ్యూలో చెప్పుకుంటూ పోతే సమంత గురించే చెప్పుకుపోవాలి. అంతలా మెస్మరైజ్ చేసింది

సమంత చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. రీమేక్ అయినప్పటికీ దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే డ్రెస్సింగ్ విషయంలో మాత్రం కొరియన్ సినిమానే చాలా చోట్ల ఫాలో అయినట్టు కనిపించింది. దీంతో పాటు మిక్కీ జే మేయర్ సంగీతం కూడా గుర్తుండిపోయేలా లేదు. ట్యూన్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు పాస్ మార్కులు మాత్రమే పడతాయి. అయితే ఈమధ్య కాలంలో వచ్చిన రీమేక్స్ లో ది బెస్ట్ రీమేక్ అనిపించుకుంటుంది ఓ బేబీ మూవీ. నందినిరెడ్డి, లక్ష్మీభూపాల్ కలిసి చేసిన మార్పులు.. సమంత పెర్ఫార్మెన్స్ దీనికి ప్రధాన కారణాలు.

ఓవరాల్ గా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకుల్ని బేబీ డిసప్పాయింట్ చేయదు. నవ్విస్తూ కంటతడి పెట్టిస్తుంది. ఎమోషనల్ గా ఆకట్టుకుంటూనే నవ్విస్తుంది.

న‌టీన‌టులు: సమంత, నాగ‌శౌర్య‌, ల‌క్ష్మి, రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, తేజ, ప్ర‌గ‌తి త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: నందినీ రెడ్డి
నిర్మాత‌లు: సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్
బ్యాన‌ర్స్‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్, క్రాస్ పిక్చ‌ర్స్‌
స‌హ నిర్మాత‌లు: వివేక్ కూచిబొట్ల‌, యువ‌రాజ్ కార్తికేయ‌న్‌, వంశీ బండారు
ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు: విజ‌య్ డొంకాడ‌, దివ్యా విజ‌య్‌
మ్యూజిక్‌: మిక్కీ జె.మేయ‌ర్‌
కెమెరా: రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌
డైలాగ్స్‌: ల‌క్ష్మీ భూపాల్‌
ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధిఖీ
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: జ‌య‌శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ‌న్‌
ఆర్ట్‌: విఠ‌ల్‌.కె
రిలీజ్ డేట్: జులై 5, 2019

రేటింగ్ 3.25/5

 

@ జీ సినియాలు

Trending News