Omicron vs booster dose: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో ఈ కొత్త వేరియంట్‌ను ఎలా ఎదుర్కోవాలా అనే పరిశోధనలు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా వరకు వ్యాక్సిన్ తయారీ కంపెనీలు తాము తయారు చేస్తోన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడంలో ఎంతవరకు ఉపయోగపడతాయనే విషయంలో వివిధ ప్రకటనలు చేసుకుంటూనే ఉన్నారు. ఇదిలావుండగా చాలా మందిలో మెదులుతున్న మరో సందేహం ఏంటంటే.. కొవిడ్-19 బూస్టర్ డోస్ (COVID-19 booster jab) తీసుకుంటే ఒమిక్రాన్ వేరియంట్‌కి చెక్ పెట్టవచ్చా అని. కరోనా థర్డ్ వేవ్ తప్పదేమో అనే వార్తలు తెరపైకొచ్చినప్పుడే ఈ బూస్టర్ డోస్ షాట్ కూడా ప్రచారంలోకొచ్చింది. ఒమైక్రాన్ రాకతో మరోసారి బూస్టర్ షాట్ వార్తలకు ప్రాధాన్యత చేకూరింది.
ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 38 దేశాలకు పాకింది. దీంతో కరోనావైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనే సంతోషం కాస్తా ఆవిరై.. మళ్లీ ఏం జరగనుందా (Coronavirus third wave) అనే భయాందోళన జనాన్ని వెంటాడుతోంది. బూస్టర్ షాట్‌తో ఒమిక్రాన్ వేరియంట్‌కి చెక్ పెట్టొచ్చేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. దానికి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు. అంతేకాకుండా ఒమిక్రాన్ వేరియంట్లో అధిక మ్యూటేషన్స్ ఉండటం వల్ల అది వ్యాక్సిన్ ప్రభావాన్ని సైతం బలహీనపరుస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాల్లో నిజం ఎంత ఉందో తేలకముందే.. ప్రస్తుతం వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ప్రత్యేకించి కొత్త వేరియంట్‌ని (Vaccines for Omicron variant) లక్ష్యంగా చేసుకుని కొత్త వ్యాక్సిన్స్ తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి.
కొత్తగా వస్తున్న వేరియంట్స్‌ని ఓడించాలంటే బూస్టర్ షాట్స్ అవసరం తప్పనిసరి అని పలువురు హెల్త్ ఎక్స్పర్ట్స్ (Health experts about booster dose) అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలా ఎంత కాలం అనే ప్రశ్నకే సమాధానం లభించడం లేదు. ఇజ్రాయెల్, బ్రిటన్ దేశాల్లో ఫైజర్ బూస్టర్ డోసుతో కరోనావైరస్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్కి చెక్ పెట్టొచ్చని (Can we check Omicron with booster dose) నిరూపితమైందని అక్కడి గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా రోజువారీ కరోనావైరస్ పాజిటివ్ కేసులు సైతం తగ్గినట్టు ఆ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో బూస్టర్ డోసుపై జరిపిన అధ్యయనాల్లో వైరస్ పునరుత్పత్తి సంఖ్య కూడా తగ్గుతుందని తేలినట్టు తెలుస్తోంది.
ఇండియాలో ఒమిక్రాన్ కేసులు (Omicron variant cases in India) సంఖ్య మొత్తం 5 కి చేరింది. తాజాగా ఢిల్లీలో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదైంది. టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు నిర్థారణ అయింది. ఢిల్లీలో వెలుగు చూసిన తొలి ఒమైక్రాన్ కేసుతో (Omicron variant cases in Delhi) కలిపి భారత్‌లో గుర్తించిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం ఐదుకు చేరింది. దీంతో ప్రస్తుతం భారత్‌లోనూ బూస్టర్ షాట్‌పై చర్చ మొదలైంది.