2017 సంవత్సరంలో మొత్తం 138 మంది పాకిస్థాన్‌కి చెందిన ఆర్మీ సైనికులని భారత సైన్యం మట్టుబెట్టినట్టు భారత నిఘా వర్గాలు తెలిపాయి. సరిహద్దులతోపాటు జమ్మూకాశ్మీర్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద భారత్‌లోకి చొరబాటుకు యత్నించే క్రమంలో పాక్ సైనికులని మట్టుబెట్టినట్టు నిఘావర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో భారత్ వైపు నుంచి 28 మంది సైనికుల వీర మరణం పొందినట్టు నిఘావర్గాలు పీటీఐకి వెల్లడించిన వివరాలు స్పష్టంచేశాయి. అంతేకాకుండా అక్రమ చొరబాట్లని అడ్డుకోవడం సహా పాక్ కాల్పులని తిప్పి కొట్టే క్రమంలో గతేడాది సుమారు 70 మంది భారత సైనికులు గాయపడ్డారు.
ఇక పాకిస్థాన్ అంతర్గత వైఖరి విషయానికొస్తే, సాధారణంగా ఇండియన్ ఆర్మీ చేతిలో ప్రాణాలు కోల్పోయిన పాకిస్థాన్ ఆర్మీ సైనికులని ఆ దేశం బాహ్య ప్రపంచానికి అలా చూపించుకోదు అని భారత నిఘా వర్గాలు పీటీఐకి ఇచ్చిన సమాచారంలో పేర్కొన్నాయి. కార్గిల్ యుద్ధంలో పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు భారత్ ఆధారాలు చూపించినప్పటికీ.. పాక్ మాత్రం ఆ వివరాలని ధృవీకరించలేదు. అది పాక్ అవలంభించే వైఖరికి నిదర్శనం. అంతేకాకుండా గతేడాది చివర్లో డిసెంబర్ 25న సరిహద్దు నియంత్రణ రేఖ దాటి పాకిస్థాన్ భూభాగంలోకి కాలుపెట్టిన భారత సైనికులు అక్కడ ముగ్గురు సైనికులని హతమార్చిన విషయాన్ని సైతం పాక్ ధృవీకరించలేదు. ముగ్గురు సైనికులు మృతిచెందినట్టుగా మొదట ట్వీట్ చేసిన పాక్ ఆర్మీ... ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ ట్వీట్‌ని డిలీట్ చేయడం పాక్ వైఖరికి మరో ఉదాహరణ అని నిఘావర్గాలు గుర్తుచేశాయి.
2017లో పాకిస్థాన్ మొత్తం 860 సందర్భాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అధికారిక గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. 2017లో భారత్ సైతం సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లని అడ్డుకుంటూనే మరోవైపు పాక్ ఆర్మీ సహాయంతో రెచ్చిపోతున్న ఉగ్రమూకల పనిపట్టడంలో ఇండియన్ ఆర్మీ వేగం పెంచింది.