Ayodhya Ram Mandir Pran Pratishtha: హిందూవుల చిరకాల స్వప్నం.. దశాబ్దాల కల ఈనెల 22న నెరవేరబోతున్నది. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ట ఉత్సవాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి హిందూ ధార్మిక సంస్థలు, మఠాధిపతులు, పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఆరోజు దేశమంతా పండుగ వాతావరణం సంతరించుకోనుంది. రామాలయం ప్రాణప్రతిష్ట సందర్భంగా చాలా రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ సెలవు ప్రకటించాలనే డిమాండ్ పెరుగుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమిగా పిలిచే అయోధ్యలో కొత్తగా రామాలయం నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. పూర్తి కావొచ్చిన ఆ ఆలయంలో ఈనెల 22న సోమవారం శాస్త్రోక్తంగా.. అట్టహాసంగా బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఈ మహోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. అంతే కాకుండా మద్యం, మాంసం దుకాణాలు కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. చాలా రాష్ట్రాలు కూడా యూపీ మాదిరి ప్రకటించాయి.
బడులు, వైన్స్, మద్యం దుకాణాలు బంద్
మధ్యప్రదేశ్, గోవా, చత్తీస్‌గడ్, హర్యానా రాష్ట్రాలు సెలవును ప్రకటించాయి. ఆరోజు విద్యాలయాలకు సెలవుతోపాటు మద్యం, మాంసం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్‌లను కూడా మూసివేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు వెలువరించాయి. కాగా సెలవు ప్రకటించిన రాష్ట్రాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు కావడం గమనార్హం. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే బాటలో ఉన్నాయని సమాచారం. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం తదితర రాష్ట్రాలు కూడా సెలవు ఇవ్వాలని యోచిస్తున్నాయి. కాగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో సెలవు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆ పార్టీ రామాలయ ప్రారంభోత్సవానికి గైర్హాజరు అవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఆ రాష్ట్రాలు అయోధ్య సెలవు ఇచ్చే ఆస్కారం లేదు.
మరి తెలుగు రాష్ట్రాలు?
ఇక ఆంధ్రప్రదేశ్‌లో అయోధ్య సెలవు తెరపైకి వచ్చింది. సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. సోమవారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే మరొక రోజు అంటే 22న కూడా సెలవు పొడిగించాలనే డిమాండ్ వస్తోంది. బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి పురంధేశ్వరి తాజాగా అదే డిమాండ్ చేశారు. రామ మందిరం ప్రారంభం శతాబ్దాల కల, దశాబ్దాల పోరాటంగా ఆమె పేర్కొన్నారు. అయోధ్య ఘట్టం అందరూ తిలకించేలా ఏపీ ప్రభుత్వం కూడా 22వ తేదీన సెవలు ప్రకటించాలని కోరారు. సెలవుకు రాష్ట్రాలు విముఖత చూపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే జాతీయ సెలవు దినం ప్రకటించనుందని సమాచారం.
నేడు పూజలు
ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా గురువారం రామ్ లల్లా విగ్రహానికి పూజలు చేయనున్నారు. బుధవారం ఆలయ గర్భగుడికి విగ్రహానికి క్రేన్ ద్వారా తీసుకువచ్చారు. నేటి మధ్యాహ్నం 1.20 గంటలకు సంకల్ప కార్యక్రమం చేయనున్నారు. అనంతరం గణేశాంబికా పూజ, వరుణ పూజ, చతుర్వేదోక్త పుణ్యాహ్వచనం, మాతృకాపూజ, వసోర్ధర పూజ, ఆయుష్య మంత్ర జపం, ఆచార్యాదిచత్విగ్వరణ్, మధుపర్క పూజ, మండప ప్రవేశం తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. విగ్రహానికి సాయంత్రం జలాధివాసం, గంధాదివాసం, ఆరాధన, హారతి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక 22న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో 7 వేల మంది అతిరథమహారథుల మధ్య రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది.
Also Read: Fact check: అయోధ్య రామాలయం, శ్రీరాముడి చిత్రాలతో కొత్త 500 రూపాయల నోటు
Also Read Ayodhya Laddu: అయోధ్య బాలరాముడికి హైదరాబాద్ నుంచి 1265 కిలోల భారీ లడ్డూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter