మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు బహుజన్ సమాజ్ వాది పార్టీ సిద్ధంగా ఉందన్న వార్తలపై ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు తాము సిద్ధంగానే ఉన్నప్పటికీ తమకు తగిన సంఖ్యలో సీట్లు కేటాయిస్తేనే అందుకు అంగీకరిస్తాం అని మాయావతి స్పష్టంచేశారు. మంగళవారం మాయావతి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మూడు రాష్ట్రాల్లోనూ బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి తగినన్ని సీట్లు కేటాయించడానికి కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం లేకపోతే, ఆ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని విమర్శించడంలో ఎప్పుడూ ముందే ఉంటున్న బీఎస్పీ భవిష్యత్లో మరింత బలం పెంపొందించుకునేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో సైతం జత కట్టేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది.
రానున్న లోక్ సభ ఎన్నికల్లోనూ కూటములు, సీట్ల పంపకాలపై బహుజన్ సమాజ్ వాదీ పార్టీ ఇప్పటికే నుంచే దృష్టిసారించినట్టు నెల రోజుల క్రితమే పలు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.