Vizag Steel Plant: ఆంధ్రప్రదేశ్‌కు భారీ కానుక.. విశాఖ స్టీల్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ

Rs 11440 Crore Revival Package For Vizag Steel Plant: ప్రైవేటీకరణ జరుగుతుందని.. మూతపడుతుందని వైజాగ్‌ స్టీల్‌పై తీవ్ర చర్చ జరగ్గా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీతో వైజాగ్‌ స్టీల్‌కు పూర్వ వైభవం రానుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 17, 2025, 05:21 PM IST
Vizag Steel Plant: ఆంధ్రప్రదేశ్‌కు భారీ కానుక.. విశాఖ స్టీల్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ

Revival Package For Vizag Steel Plant: గత ఎన్నికల్లో వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ జరుగుతుందని కీలక ప్రచారం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్టణం స్టీల్‌ ఫ్యాక్టరీకి ఊపిరి వచ్చింది. ప్రైవేటీకరణ జరగదని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. తాజాగా వైజాగ్‌ స్టీల్‌కు ఊపిరి పోసేలా భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. విశాఖ స్టీల్‌కు రూ.11,440 కోట్ల ప్యాకేజ్‌ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు.

Also Read: YS Sharmila: 'సూపర్‌ సిక్స్‌ ఇవ్వలేక.. ఆడలేక మద్దెల దరువన్నట్టు చంద్రబాబు తీరు'

న్యూఢిల్లీలో గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న కీలకమైన నిర్ణయాల్లో స్టీల్‌ ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజీ అంశాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రత్యేకంగా వెల్లడించారు. రాష్ట్రీయ ఇస్పత్‌ నిగమ్‌ లిమిటెడ్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌ ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దేశ ఉక్కు అవసరాలు తీర్చడంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కీలక పాత్ర పోషిస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం, కార్మికులకు శుభాకాంక్షలు అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు.

Also Read: Muppa Raja: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ 'సస్పెండ్‌ ద లీడర్‌'.. ముప్పా రాజాపై వేటు

'ఉక్కు రంగంలో విశాఖ ఉక్కు ప్రధానమైన సంస్థ. విశాఖ ఉక్కు పోర్టు ఆధారిత స్టీల్‌ ప్లాంట్‌. ఈ పరిశ్రమను ఏళ్ల తరబడి సమస్యలు వేధిస్తున్నాయి. విశాఖ ఉక్కుకు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ తక్షణం అమల్లోకి వస్తుంది. త్వరలో రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు ప్రారంభం కానుండగా.. ఆగస్టు వరకు 3 బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు వినియోగంలోకి వస్తున్నాయి. విశాఖ స్టీల్‌కు ముడి సరుకు సరఫరా కోసం ఎన్‌ఎండీసీతో చర్చలు చేస్తున్నాం' అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు కర్మాగారం. 7.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వరుసగా ఆర్థికంగా నష్టాల బారిన పడుతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వైజాగ్‌ స్టీల్‌కు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ఊపిరి పోయనుంది. కాగా వైజాగ్‌ స్టీల్‌ను ప్రైవేటీకరణకు మోదీ ప్రభుత్వం మొగ్గు చూపగా కార్మికులు తీవ్ర ఆందోళన చేపట్టారు. దాదాపు ఏడాదికిపైగా ఉద్యమం చేయగా ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగిరావడంతో వైజాగ్‌ స్టీల్‌ మనుగడ కొనసాగనుంది. తాజా ప్యాకేజ్‌తో వైజాగ్‌ స్టీల్‌కు పూర్వ వైభవం రానుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News