న్యూఢిల్లీ: ఐటి రిటర్న్స్ దాఖలు సహా అనేక ఆర్థిక వ్యవహారాల్లో పాన్ కార్డు పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అందరికీ తెలిసిందే. పాన్ నెంబర్ లేకుండా ఐటి రిటర్న్స్ దాఖలు చేయడం కుదిరేపని కూడా కాదు. అయితే, ఇకపై పాన్ కార్డు లేకున్నా.. ఐటి రిటర్న్స్ దాఖలు చేసుకునే విధంగా కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని చదువుతూ.. ఇకపై పాన్ కార్డు లేకున్నా, ఆధార్ నెంబర్‌తో ఐటి రిటర్న్స్ దాఖలు చేసుకునే విధంగా ప్రతిపాదన తీసుకొస్తున్నట్టు స్పష్టంచేశారు. పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు ఈ రెండింటిలో దేనిసాయంతోనైనా ఐటి రిటర్న్స్ దాఖలు చేసుకోవచ్చని నిర్మలా సీతారామన్ సూచించారు.