Nithin Gadkari: నితిన్ గడ్కరీ.. దేశంలో ప్రస్తుతం ఉన్న సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరు. బీజేపీ టాప్ లీడర్లపై ఒకరైన నితిన్ గడ్కరీ.. నరేంద్ర మోడీ కేబినెట్ లో ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. మహారాష్ట్రలోని విదర్భకు చెందిన నితిన్ గడ్కరీకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అండదండలు పుష్కలంగా ఉన్నాయంటారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగ్ పూర్ కు చెందిన వారు నితిన్ గడ్కరీ. అందుకే మొదటి నుంచి ఆయనకు సంఘ్ పరివార్ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. బీజేపీలో ప్రధానమంత్రి రేసులో ఆయన పేరు చాలా సార్లు వినిపించింది. 2014 ఎన్నికల సమయంలోనూ బీజేపీ ప్రధాని రేసులో గడ్కరీ నిలిచారు. అయితే ప్రధానమంత్రి పదవి నరేంద్ర మోడీని వరించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పని చేశారు నితిన్ గడ్కరీ. ముక్కుసూటిగా మాట్లాడుతారని నితిన్ గడ్కరీకి పేరుంది. ఏ విషయంలోనైనా ఎలాంటి దాపరికం లేకుండా ఆయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారని టాక్. అదే ఆయనకు బలం, బలహీనత అని అంటారు.
కొద్ది రోజులుగా నితిన్ గడ్కరీ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి పేరు ఉచ్చరించనప్పటికి కొందరు టార్గెట్ గానే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవలే బీజేపీలో అత్యున్నత పార్లమెంటరీ బోర్డును పునర్ వ్యవస్థీకరించారు. అయితే బీజేపీ బోర్డు నుంచి నూహ్యంగా నితిన్ గడ్కరీకి ఉద్వాసన పలికారు. బీజేపీలో ప్రస్తుతం టాప్ త్రీలో గడ్కరీ ఉన్నారని టాక్. అయినా అతనికి బోర్డులో చోటు దక్కలేదు. అంతేకాదు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన వారికి పార్టీ పార్లమెంటరీ బోర్డులో చోటు కల్పిస్తారు. కాని ఆ సాంప్రదాయానికి కూడా తూట్లు పొడుస్తూ కొత్త బోర్డును ఏర్పాటు చేశారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ప్రధాని మోడీ, అమిత్ షా ముద్ర ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తాజాగా నితిన్ గడ్కరీ వరుసగా హాట్ కామెంట్లు చేస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది.
కొన్ని రోజుల క్రితమ ఓ సమావేశంలో మాట్లాడిన గడ్కరీ.. ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడమే ప్రస్తుతమున్న సమస్యకు కారణమని కామెంట్ చేశారు. ప్రధాని మోడీ టార్గెట్ గానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం సాగింది. అది జరిగిన కొన్ని రోజులకే మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో బీజేపీ పవర్ లోకి రావడానికి లాల్ కృష్ణ అద్వానీ, వాజపాయి చేసిన కృషే కారణమని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రస్తావన లేకుండా గడ్కరీ మాట్లాడటం సంచలమైంది. బీజేపీలో సెగలు రేపింది. తాజాగా తన సొంత గడ్డ నాగ్ పూర్ లో జరిగిన పారిశ్రామిత వేత్తల సమావేశంలో మాట్లాడిన నితిన్ గడ్కరీ.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరానికి వాడుకుని వదిలేయకూడదని అన్నారు. ఒక వ్యక్తి ఓడిపోయినప్పుడు కాదని అతడిని వాడుకుని పూర్తిగా వదిలేసినప్పుడే అంతమవుతాడంటూ నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాపారులు, రాజకీయ నేతలు, ఇతర రంగాల్లో ఉన్న ఎవరికైనా మానవ సంబంధాలే అతిపెద్ద బలమన్నారు గడ్కరీ.
ఎవరూ ఎవరిని వాడుకుని వదిలేసే మనస్తత్వంతో ఉండకూడదన్నారు గడ్కరీ. మంచి చెడుల సమయంలోనూ పట్టుకున్న చేతిని వదలకూడదని.. ఎల్లప్పుడూ పట్టుకునే ఉండాలన్నారు. ఎదిగే వ్యక్తులకు భజన చేయవద్దంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు నితిన్ గడ్కరీ. బీజేపీలో ప్రధాని మోడీకి పెరుగుతున్న వ్యక్తి పూజను విమర్శిస్తూనే నితిన్ గడ్కరీ ఈ కామెంట్లు చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తనకు సంబంధించిన కీలక విషయాలు చెప్పారు గడ్కరీ. కాంగ్రెస్ పార్టీలో చేరాలని గతంలో తనకు ఆహ్వానం వచ్చిందని.. అయితే ఆ పార్టీ భావజాలం తనకు నచ్చదని చెప్పానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం కంటే సూసైడ్ చేసుకోవడమే మంచిదని ఆపార్టీ నేతలకు నేరుగా చెప్పానన్నారు. నితిన్ గడ్కరీ వరుసగా చేస్తున్న కామెంట్లు కమలం పార్టీలో కలకలం రేపుతుందని అంటున్నారు.
Read also: Bandi Sanjay: కాళేశ్వరం సందర్శనకు బీజేపీ బృందం.. అవినీతి లెక్క తేల్చేందుకేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook