బికనేర్: భారత వాయుసేనకు చెందిన మిగ్-21 యుద్ధ విమానం ఇవాళ కొద్దిసేపటి క్రితం రాజస్తాన్‌లోని బికనేర్‌లో కూలిపోయింది. ఈ ఘటన నుంచి పైలట్ సురక్షితంగా బయటపడినట్టు అక్కడి స్థానిక పోలీసులు తెలిపారు. రోజూవారి విధుల్లో భాగంగానే నాల్ వైమానిక స్థావరం నుంచి గాల్లోకి లేచిన విమానం 14 కిమీ ప్రయాణించిన అనంతరం శోభ సర్ కి ధని గ్రామానికి సమీపంలో కూలిపోయింది. పక్షి ఢీకొనడం వల్లే యుద్ధ విమానం కూలిపోయిందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు రక్షణ శాఖ అధికారవర్గాలు తెలిపాయి.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, భారత వాయుసేన విభాగం అధికారులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. భారత వాయుసేన విరివిగా ఉపయోగించే యుద్ధ విమానాల్లో మిగ్-21 కూడా ఒకటి. సింగిల్ ఇంజిన్ కలిగిన ఈ యుద్ధ విమానంలో ఒక్క పైలట్ మాత్రమే విధులు నిర్వహించగలరు.