ఇటీవలే మదురైలో 'మక్కల్ నీది మయ్యం' రాజకీయ పార్టీ ప్రారంభించిన సినీనటుడు కమల్ హాసన్ చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన రజినీకాంత్ పై స్పందించారు. ‘ఇప్పటి వరకు నేనూ, నా స్నేహితుడు రజనీకాంత్ ఎన్నో సినిమాలు చేశాం. ఎన్నో సూపర్‌హిట్స్ అందుకున్నాం. అయినా ఇద్దరి వ్యూహాలు వేరు. ఇద్దరి అభిరుచులు వేరు. సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు నేను చేయలేదు. నాలాంటి పాత్రలు ఆయన చేయలేదు. సినిమా రంగంలో ఉన్నప్పుడు... సగటు ప్రేక్షకులని అలరించడమే మాకు ముఖ్యం' అన్నారు.
'ఇప్పుడు ఇద్దరం రాజకీయాల్లోకి ప్రవేశించాం. ఆయన రాజకీయ వ్యూహాలేంటో నాకు తెలీదు. రాజకీయంగా నా సిద్ధాంతాలు నాకున్నాయి. ఆయన సిద్ధాంతాలు ఆయనకు ఉన్నాయి. రజినీ అధ్యాత్మిక రాజకీయాలపై నాకు నమ్మకం లేదు. నేను లౌకికవాదిని. నేను మతాలను నమ్మను. నాకు ఏ మతం మీదా ప్రేమలేదు' అని చెప్పారు. సినిమాల సమయంలో కొనసాగిన స్నేహాన్ని రాజకీయాల్లో ఆశించలేమన్నారు. ఆయనతో నాకు మంచి అనుభవం ఉంది. మేమిద్దరం రాజకీయంగా వేరైనా వాటి ప్రభావం మా బంధంమీద పడదని, ఒకరినొకరం విమర్శించుకోకుండా గౌరవప్రదమైన రాజకీయాలు సాగించాలని ఇద్దరం కోరుకుంటున్నామని తెలిపారు. మరోవైపు హిమాలయాల పర్యటనలో ఉన్న రజనీకాంత్ సంపూర్ణ అరోగ్య పరీక్షల నిమిత్తం అక్కడి నుంచి నేరుగా అమెరికా వెళ్లనున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ ‘శభాష్‌నాయుడు’, భారతీయుడు-2 తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.