ముంబయిలో ఓ విచిత్రమైన కేసులో.. న్యాయమూర్తి కూడా ఓ చిత్రమైన తీర్పు ఇచ్చారు. ముంబయిలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన సాజిద్ అనే వ్యక్తిని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంచారు. అయితే ఆ జైలులో భోజనం అసలేమీ బాగాలేదని.. తాను బీపీ పేషెంటును కాబట్టి వైద్యుని సలహా మేరకు తనకు ఇంటి భోజనం తినే అవకాశం కల్పించాలని సదరు నిందితుడు న్యాయమూర్తిని కోరాడు. ఈ క్రమంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ఆ ఖైదీ జైలులో సరఫరా చేసిన చపాతీలను కూడా తన వెంటబెట్టుకొని వచ్చి.. వాటిని న్యాయమూర్తికి సాక్ష్యంగా చూపించాడు. వైద్యుల సలహా మేరకు తాను ఈ చపాతీలను తినలేనని చెప్పాడు.
న్యాయమూర్తి కూడా జైలులో సరఫరా చేస్తున్న భోజనం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిందితుడు కూడా తన ఆరోగ్యం ఏ మాత్రం బాగాలేదని చెబుతూ.. ప్రభుత్వ డాక్టర్లు అందించిన మెడికల్ రిపోర్టులు కూడా కోర్టుకి అందించాడు. ఆ రిపోర్టులను పరిశీలించిన న్యాయమూర్తి... ఓ 6 నెలల పాటు ఆయా ఖైదీ ఇంటి నుండి భోజనం తెప్పించుకోవచ్చని తీర్పు చెప్పారు.
సాజిద్ అనే వ్యక్తిని 2015లో రూ.30 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సరఫరా కేసులో ముంబయిలో పోలీసులు అరెస్టు చేశారు. ఆ రోజు నుండి జైల్లో ఆహారాన్నే సాజిద్ తింటున్నాడు. ఇటీవలే ఆ ఆహారం వల్ల తన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని చెబుతూ.. కోర్టులో కేసు వేయించాడు సాజిద్. ఈ క్రమంలో ఈ కేసును స్వీకరించిన ఎన్‌డీపీఎస్ కోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ.. బొంబాయి హైకోర్టు తీర్పుతో పాటు సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకొని ఖైదీల హక్కులకు భంగం కలిగించకూడదనే ఉద్దేశంతో ఈ తీర్పును ఇస్తున్నట్లు తెలిపారు.
అయితే అన్ని కేసుల్లోనూ ఈ తీర్పును ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అదేవిధంగా జైలు సిబ్బంది కూడా ఖైదీలు కూడా మనుషులే అన్న విషయం మరవకూడదని.. వారికి మంచి ఆహారాన్ని సరఫరా చేయాలని అభిప్రాయపడ్డారు. తాజా కేసులో.. ఖైదీ ఆహారాన్ని ఇంటి నుండి తెప్పించుకున్నా.. జైలు సిబ్బంది పూర్తిగా పరీక్షించాకే.. దానిని లోపలికి పంపించాలని న్యాయమూర్తి ఆదేశించారు.