Supreme Court on Creamy layer: ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పులో జస్టిస్ బేలా త్రివేది విబేధించారు. 6-1 మెజార్టితో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అదే సమయంలో క్రిమీలేయర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై నలుగురు న్యాయమూర్తులు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను ఆమోదిస్తూ ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని 6-1 మెజారిటీతో తీర్పు వెలురించిన సుప్రీంకోర్టు ధర్మాసనం క్రిమీలేయర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమీ లేయర్ గుర్తించాలని, తద్వారా అనర్హుల్ని రిజర్వేషన్ పరిధి నుంచి తొలగించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు ఈ వ్యాఖ్యలతో ఏకీభవించారు. వీరిలో జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఉన్నారు. ఈ నలుగురి అభిప్రాయాలు తెలుసుకుందాం.
జస్టిస్ బీఆర్ గవాయి ఏమన్నారంటే
ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ కేటగరీలో కూడా క్రిమీలేయర్ గుర్తించే విధానం రూపొందించాలి. తద్వారా అనర్హుల్ని రిజర్వేషన్ పరిధి నుంచి తొలగించవచ్చు. ఇలా చేయడం ద్వారానే రాజ్యాంగంలో ప్రస్తావించిన సమ న్యాయం సూత్రాల్ని పాటించినట్టవుతుంది. ఎస్టీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లల్ని అదే వర్గానికి చెంది గ్రామాల్లోని ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలతో పోల్చగలమా అని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. రిజర్వేషన్ ద్వారా లబ్ది పొంది ఓ స్థాయిని పొంది, సామాజిక, ఆర్ధిక పరంగా వెనుకబాటుతనం నుంచి బయటపడినవారి పిల్లల్ని ఇప్పటికీ ఊర్లలో కూలీ పనులు చేసుకునే ఎస్సీ ఎస్టీ వర్గాలవారి పిల్లలతో పోల్చలేమని జస్టిస్ గవాయి స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీలో ఓబీసీ లేయర్ గుర్తించి వారిని రిజర్వేషన్ కేటగరీ నుంచి తొలగించవచ్చని కోర్టు తెలిపింది.
జస్టిస్ విక్రమ్ నాథ్ ఏమన్నారంటే
జస్టిస్ విక్రమ్ నాథ్ కూడా జస్టిస్ బీఆర్ గవాయి అభిప్రాయంతో ఏకీభవించారు.ప్రస్తుతం ఓబీసీల్లో క్రిమీలేయర్ గుర్తించడం ద్వారా రిజర్వేషన్ పరిధి నుంచి అనర్హుల్ని ఏ విధంగా తొలగిస్తున్నారో అదే విధంగా ఎస్సీ ఎస్టీ కేటగరీలో క్రిమీ లేయర్ గుర్తించి అనర్హులకు రిజర్వేషన్ తొలగించవచ్చని చెప్పారు.
జస్టిస్ పంకజ్ మిథల్ ఏమన్నారంటే
ఎస్సీ ఎస్టీ కేటగరీలో క్రిమీ లేయర్ విధానాన్ని జస్టిస్ పంకజ్ మిథల్ సమర్థించారు. రిజర్వేషన్ లబ్ది అనేది ఓ కుటుంబంలో ఓ తరానికి మాత్రమే లభించాలని చెప్పారు. ఏదైనా కుటుంబం రిజర్వేషన్ లబ్ది పొంది ఉన్నత స్థానాన్ని పొందితే ఇక ఆ కుటుంబంలో ఇతర తరాలకు రిజర్వేషన్ కల్పించకూడదని జస్టిస్ పంకజ్ మిథల్ తెలిపారు. దీనికోసం తగిన కాల వ్యవధి నిర్ణయించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని కోరారు. ఎందుకంటే రిజర్వేషన్ లబ్ది పొందడం ద్వారా సాధారణ వర్గాలకు సమాన హోదా దక్కించుకున్నారు.
జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఏమన్నారంటే
ఎస్సీ ఎస్టీ కేటగరీలో క్రిమీ లేయర్ విషయంపై జస్టిస్ గవాయి అభిప్రాయంతో ఈయన ఏకీభవించారు. ఎస్సీ ఎస్టీ వర్గాల్లో క్రిమీలేయర్ గుర్తింపు అనేది ఇప్పుడిక ప్రభుత్వాలకు తప్పనిసరిగా మారనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook