ముంబై: తల్లితండ్రులిద్దరూ విడివిడిగా జీవిస్తున్నా.. లేదా విడాకులు తీసుకొని ఉన్న సందర్భాల్లో 18 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత కుమార్తెకు కూడా తన తండ్రి నుంచి భరణం అడిగే హక్కు ఉందని బాంబే హైకోర్టు పేర్కొంది. తమ 19ఏళ్ల కుమార్తెకు వేరుగా ఉంటున్న తన భర్త నుంచి భరణం ఇప్పించాలంటూ ముంబాయికి చెందిన ఓ మహిళా దాఖలుచేసిన అభ్యర్ధనపై విచారణ సందర్భంగా ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ముంబయికి చెందిన ఓ మహిళ తన 19ఏళ్ల కూతురుకు భర్త నుంచి నిర్వహణ ఖర్చులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. కాగా మైనర్ పిల్లలకు మాత్రమే భరణం లభిస్తుందని చెప్తూ కుటుంబ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఆమె బాంబే కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆమె పిటిషన్‌లో న్యాయం వుందని.. కూతురు పెళ్ళి అయ్యేవరకు తండ్రి ఆమెకు భరణం ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. సదరు మహిళ తన భర్త నుంచి నెలకు రూ.25 వేల భరణం పొందుతుండగా, తన కూతురు ఖర్చుల కోసం మరో 15 వేల రూపాయలు కావాలని పిటిషన్‌లో కోరుతోంది.
కోర్టులో పిటిషన్ వేసిన మహిళకు 1988లో వివాహం జరిగింది. వీళ్లు 1997లో విడిపోయారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. వారు తల్లి వద్దే ఉంటున్నారు. పిల్లలు మైనర్లుగా ఉన్నంత వరకు తండ్రి ముగ్గురు పిల్లలకూ నిర్వహణ ఖర్చులు ఇచ్చేవారు. కాగా కుమార్తెకు 18 ఏళ్ళు నిండాయి కాబట్టి ఆమెకు నిర్వహణ ఖర్చులు ఇవ్వనని తండ్రి చెప్పటంతో సదరు మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కూతురు మేజర్ అయినా.. ఆమె పోషణ తనమీదే ఉందని.. కొడుకులు కూడా సహాయం చేసే స్థితిలో లేరని పిటిషన్‌లో పేర్కొంది. ఓ కొడుకు ఎడ్యుకేషన్ లోన్ కట్టుకుంటున్నాడని.. ఇంకొక కొడుక్కి ఇంకా ఉద్యోగం రాలేదని తెలిపింది. ఇదిలా వుండగా తన కూతురు తరఫున తల్లి తన భర్త నుంచి నిర్వహణ ఖర్చులు కోరడంలో న్యాయం వుందని జస్టిస్ భారతి డాంగ్రే తెలిపారు.