చెన్నై: 72 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జె. జయలలిత డిసెంబర్ 5, 2016న మృతిచెందారు. నేటికి పురుచ్చితలైవి చనిపోయి ఏడాది అయ్యింది. కానీ ఇప్పటికీ ఆమె మరణానికి దారితీసిన పరిణామాలు మిస్టరీగానే ఉన్నాయి. జయలలిత మరణంపై ఈ ఏడాది పొడవునా ఎన్నో అనుమానాలు, ఆరోపణలు వచ్చాయి. ఇంతకీ జయలలిత మరణానికి దారితీసిన కారణాలు ఏవీ? ఆమెను హత్య చేశారా? కుట్రపన్నారా?.. ఇలా ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి.
1. రహస్యం: జయలలితను అపోలో హాస్పిటల్ లో చేర్పించాక ఏఐడిఎంకే పార్టీనేతలు ఆమె బాగుందని.. కోలుకుంటోందని.. త్వరలో మన మధ్యకు వస్తారని చెప్పారు. అయితే ఆమెను చూడటానికి ఎవ్వరినీ లోనికి అనుమతించలేదు.. ఎందుకు?. రోజూ డాక్టర్లు హెల్త్ బులిటెన్లు విడుదల చేస్తున్నా.. సరైన ఆరోగ్యం గురించి ఎందుకు చెప్పలేదు అనేదీ ఇప్పటికీ అంతుచిక్కడం లేదు.
2. విషమిచ్చారు: జయలలితకు నెమ్మది నెమ్మదిగా విషమిచ్చారని (స్లో పాయిజన్) ప్రముఖ మ్యాగజిన్ తెహల్కా 2012లో ఆరోపించింది. ఆమె తినే తిండిలో, నీళ్లలో కొద్ది కొద్ది మోతాదులో విష రసాయనాలను కలుపుతున్నారని ఆరోపించింది. ఈ కుట్రలో జయ సన్నిహితురాలు శశికళ హస్తం ఉందని ఆరోపించింది. శశికళ నియమించిన ఒక నర్సు ఆమెకు విషమిచ్చిందని తెలిపింది.
3. ఆమెను తోసేశారు: జయలలితను సెప్టెంబర్ 22వ తేదీ తోసేశారని తమిళనాడు స్పీకర్ పిహెచ్ పాండియన్ ఆరోపణ. ఒక విషయమై జయలలిత చెన్నైలోని తన నివాసం పోయెస్ గార్డెన్ లో ఒక కుటుంబ సభ్యుడితో (శశికళ కుటుంబం) గొడవ పడుతుండగా.. సదరు వ్యక్తి ఆమెను తోసేశారని.. ఇది బయటకు పొక్కకుండా ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లారని ఆరోపించారు.
4. జయ మొఖం మీద రంధ్రాలు: జయలలిత చనిపోయాక ఆవిడ మృతదేహాన్ని పార్టీ కార్యాలయానికి సందర్శనార్థం తరలించారు. కానీ ఆ సమయంలో అక్కడివారికి జయ ముఖం మీద నాలుగు రంధ్రాలు కనిపించాయి. అయితే ఈ రంధ్రాలు ట్రీట్మెంట్ లో భాగంగానే వచ్చాయని వైద్యులు తెలిపారు. అవి ఏ ట్రీట్మెంట్ చేస్తే వచ్చాయో ఇంకా తెలియాల్సి ఉంది.
5. ఖాళీ పేపర్లో సంతకం: ఎన్డీటీవీ కథనం మేరకు, జయ చనిపోయిందని ప్రకటించడానికి ముందురాత్రి శశికళ పార్టీ మంత్రులందరికి మూడు ఖాళీ ఏ-4 పేపర్లో సంతకం చేయాలని చెప్పిందట. ఎందుకు తీసుకుంటున్నారు అని ఆమెను అడగడానికి ఎవ్వరూ ధైర్యం చేయలేదట. ఆమె అమ్మకు సన్నిహితురాలు కనుక ఎవ్వరూ ప్రశ్నించలేదట.
6. అధికారం కోసం: జయలలిత చనిపోయిన 20రోజుల్లో పార్టీ నేతలందరికీ శశికళ ఏఐడిఎంకే పార్టీ చీఫ్ కావాలనుకుంటున్నానని చెప్పిందట. అడ్వకెట్ కృష్ణమూర్తి జయలలిత ఆస్తి కాజేయటానికి కుట్రపన్నిందని.. అందుకే ఆమెను పథకం ప్రకారం చంపేసిందని ఆరోపించారు. ఒక వీడియోను వాట్సాప్ లో పోస్టు చేశారు.
7. మోదీ హెచ్చరిక: జయలలితకు దగ్గరి వ్యక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నదని అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ హెచ్చరించారని తెహల్కా తెలిపింది. శశికళ, ఆమె కుటుంబసభ్యులకు ముడుపులు అప్పజెప్పాల్సి వస్తుందని పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు తమిళనాడుకు ముఖంచాటేస్తున్నారని ఆరోపించింది. చెన్నై మోనోరైలు వ్యవహారంలో శశికళకు ముడుపులు అందాయని.. సంతకము ఫోర్జరీ చేసిందని జయకు తెలియడంతో.. జయ శశికళను దూరం పెట్టిందని తెలిపింది.
8. తప్పుడు మందులు: ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన కథనం మేరకు.. అపోలో యాజమాన్యం చెప్పిన సమాచారం ప్రకారం జయలలితకు సెప్టెంబర్ లో ఆమె ఆసుపత్రికి చూపించడానికి ముందు 'తప్పుడు డయాబెటిస్ మందులు' ఇచ్చారని చెప్పారు.