మధ్యప్రదేశ్ భీండ్ ప్రాంతంలో ఈ రోజు జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 35 ఏళ్ళ జర్నలిస్టు సందీప్ శర్మ మరణించారు. వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా రాష్ట్రంలో ఇసుక మాఫియాకి చెందిన కేసులను బహిర్గతం చేయడంలో సందీప్ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయనపై గతంలో కూడా కొన్నిసార్లు దాడి చేసే ప్రయత్నాలు జరిగాయి. ఈ రోజు సందీప్ శర్మ ఉదయం తన మోటార్ సైకిల్ పై వెళ్తుండగా.. అదే రోడ్డులో వెళ్తున్న ఓ డంపర్ కొంచెం ముందుకు వెళ్లి.. మళ్లీ ఎడమవైపుకి టర్న్ తీసుకొని, సందీప్ మోటార్ సైకిలును గుద్దేసింది.
ఆ విధంగా డంపర్ స్కూటరును ఢీక్కొంటున్న సన్నివేశాలు ఇప్పటికే సీసీటీవీ కెమెరాల ద్వారా మీడియాకి చిక్కాయి. ఆ ఫుటేజీలో డంపర్ డ్రైవర్ కావాలనే బైక్‌ను ఢీకొన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇది కచ్చితంగా ఎవరో కావాలని చేసిన యాక్సిడెంట్ అని.. సందీప్ అనుమానాస్పదమైన రీతిలో మరణించినట్లు భావిస్తున్నామని ఇప్పటికే పలువురు పాత్రికేయులు ఫిర్యాదు చేశారు.
గతంలో సందీప్ తనకు పలువురు వ్యక్తుల వల్ల ప్రమాదం పొంచి ఉందని.. తనకు రక్షణ కల్పించమని పోలీసు అధికారులకు వినతిపత్రాన్ని అందించడం జరిగింది. అయితే ఆయనకు డిపార్టుమెంటు ఎలాంటి రక్షణను కల్పించలేదు. ఈ క్రమంలో సందీప్ ఇలా అనుమానాస్పదమైన రీతిలో ఓ డంపర్ ఢీక్కొనడం వల్ల మరణించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
#WATCH:Chilling CCTV footage of moment when Journalist Sandeep Sharma was run over by a truck in Bhind. He had been reporting on the sand mafia and had earlier complained to Police about threat to his life. #MadhyaPradesh pic.twitter.com/LZxNuTLyap
— ANI (@ANI) March 26, 2018
ప్రస్తుతం జర్నలిస్టు మరణంపై తదుపరి దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, సందీప్ ప్రమాదానికి గురయ్యారనే విషయం తెలియగానే..సంఘటనా స్థలానికి పోలీసులు హుటాహుటిన చేరుకున్నారని తెలపడం జరిగింది. అయితే ఆసుపత్రికి తరలించే లోపే సందీప్ ప్రాణాలు విడిచారని చెబుతున్నారు. సందీప్ మరణానికి సంబంధించి సెక్షన్ 304 ఏ ప్రకారం కేసు నమోదు చేశామని భీండ్ ఎస్పీ ప్రశాంత్ ఖరే మీడియాతో తెలిపారు. సందీప్ వాహనాన్ని ఢీకొన్న డంపర్‌ను స్వాధీనం చేసుకున్నామని.. డ్రైవరు కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు
జర్నలిస్టు సందీప్ శర్మ మరణంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పాత్రికేయుల రక్షణ అనేది ప్రభుత్వంపై ఉన్న అతి పెద్ద బాధ్యత అని.. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన నేరస్థులను విడిచిపెట్టే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. సందీప్ శర్మ మరణం విషయంపై కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ "ఇది ఎవరో పట్టపగలు చేసిన హత్య. ఈ ఘటనపై తప్పకుండా సీబీఐ ఎంక్వయరీ వేయాల్సిందే. బీజేపీ హయాంలో రోజు రోజుకీ జర్నలిస్టులపై ఆగడాలు పెరిగిపోతున్నాయి" అని తెలిపారు