Viral news: తమిళనాడుకు చెందిన ఓ యువకుడు మూడేళ్లు కష్టపడి తనకు ఎంతో ఇష్టమైన బజాజ్ డామినర్ 400 బైక్ కొనుగోలు చేశాడు. బైక్ విలువ రూ.2.6 లక్షలు. ఇందులో వింతేముంది? ఎవరైనా తమకు కావాల్సిన బైక్, వస్తువుల కోసం కష్టపడి కొనడం సహజమే అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
ఆ యువకుడు డబ్బు చెల్లించిన విధానం గురించే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే.. ఆ యువకుడు మూడేళ్లుగా రూపాయి నాణేలను దాస్తూ.. బైక్ కోసం పొదుపు చేశాడు. అలా బైక్ కొనేందుకు అవసరమైన రూ.2.6 లక్షలను కేవలం కాయిన్ల రూపంలోనే చెల్లించాడు.
తమినాడు అమ్మాపేట్లోని గాంధీ మైదాన్‌లో ఉండే వి భూపతి అనే 29 ఏళ్ల యువకుడు తనకు ఎంతో ఇష్టమైన డామినార్ బైక్ కొనేందుకు పైసా.. పైసా (కాయిన్ల రూపంలోనే) కూడబెట్టాడు. అలా జమ చేసిన మొత్తాన్ని గొనె సంచుల్లో మూటగట్టి.. ఈ నెల 26న సేలంలోని బజాజ్ షోరూంకు తీసుకెళ్లాడు. స్నేహితుల సహాయంతో మినీ వ్యాన్‌లో ఆ సంచులను తరలించాడు. ఆ కాయిన్లతోనే బైక్ కొనేందుకు సిద్ధపడ్డాడు. అందుకు షోరూం అధికారులు కూడా అంగీకరించడంతో.. ఆ కాయిన్స్ మొత్తాన్ని షోరూంలో పోశారు.
దీనితో ఆ షోరూం స్టాఫంతా కాయిన్లను లెక్కబెట్టే పనిలో నిమగ్నమైంది. మొత్తం లెక్కించే సరికి గంట సమయం పట్టింది.
ఆ యువకుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా సంపాదించిన డబ్బును ఆదా చేసి.. బైక్ కోసం దాచాని వెళ్లడించాడు. డామినోర్ బైక్ ఆన్ రోడ్ ధర గురించి కనుక్కోగా రూ.2.6 లక్షలుగా తెలిసందని చెప్పాడు. ఆ మొత్తం జమైన వెంటనే బైక్ షోరూంకు వెళ్లినట్లు వివరించాడు.
Tamil Nadu | A youth in Salem paid Rs 2.6 lakh to buy a bike with Re 1 coins he collected in three years. pic.twitter.com/ayLgBa23Ja
— ANI (@ANI) March 28, 2022
నెటిజన్ల ప్రశంసలు..
ఇప్పుడు ఈ అంశం చర్చనీయంశంగా మారింది. ఎంతో మంది దీనిపై మాట్లాడుకుంటూ.. చాలా మంది తమ ఆశయాలు నెరవేర్చుకునేందుకు కష్టపడుతుంటారని.. కాని కొందరు దానిని కాస్త క్రేజీగానే నెరవేర్చుకుంటారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఆ యువకుడు తనకు ఇష్టమైన బైక్ వినూత్నంగా కొని.. ఇప్పుడు వార్తల్లో నిలిచాడు.