భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టేన్ బైచుంగ్ భూటియా రాజకీయ పార్టీని స్థాపించారు. బైచుంగ్ భూటియా తన సొంత రాష్ట్రమైన సిక్కింలో హమ్‌రో సిక్కిం పార్టీ (HSP) పేరిట గురువారం పార్టీని ఏర్పాటు చేశారు. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌కి 100 కిమీ దూరంలోని దరందిన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బైచుంగ్ భూటియా తన పార్టీ పేరుని ప్రకటించారు. ఫుట్‌బాల్ క్రీడలో బైచుంగ్ భూటియాకు సీనియర్ అయిన మాజీ మంత్రి ఆర్‌బి సుబ్బ పార్టీ జండాను ఎగరవేసి భూటియాకు మద్ధతు ప్రకటించారు. పార్టీ పేరు ప్రకటించిన మొదటి సభలోనే బైచుంగ్ భూటియా సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. సిక్కిం రాష్ట్రంలో గత 4 దశాబ్ధాలుగా అభివృద్ధి లేకపోగా అవినీతి అంతకంతకూ పెరిగిపోయింది అని అన్నారు. ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారన్న భూటియా.. ముఖ్యమంత్రి పార్టీ సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (SDF) నియంతల పార్టీలా తయారైంది అని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
"అధికార పార్టీ అవినీతిని ప్రశ్నిస్తే ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఏమోననే భయంతో ప్రజలు అసలు ప్రశ్నించడమే మానేశారు. కనీస అవసరాలైన రహదారులు, నీరు, విద్యుత్ సౌకర్యాలు లేని మారుమూల గ్రామాలెన్నో వున్నాయి. సిక్కింలో 30-32 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ లాంటి బయటిదేశాలకు సిక్కిం విద్యుత్‌ని విక్రయిస్తోంది అని ముఖ్యమంత్రి పవన్ కుమార్ అప్పుడప్పుడు గొప్పగా చెబుతుంటారు కానీ వాస్తవానికి సిక్కింలోనే కోతలు లేకుండా నిరంతరంగా విద్యుత్ అందడం లేదు కదా" అని బైచుంగ్ భూటియా అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.