IND Vs NZ Match Prediction: టీ20 ప్రపంచకప్‌లో (ICC T20 World Cup 2021) మరో కీలక మ్యాచ్ కు టీమ్ఇండియా సిద్ధమైంది. దుబాయి వేదికగా ఆదివారం మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుతో (India Vs New Zeland) తలపడనుంది. గత ఆదివారం తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిన భారత జట్టు.. ఇటు బ్యాటింగ్‌లో, అటు బౌలింగ్‌లోనూ విఫలమయ్యి పరాజయాన్ని చవిచూసింది. ఒకవేళ న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లోనూ ఓడితే.. సెమీస్ చేరుకునే అవకాశాలు దాదాపుగా కోల్పోయినట్లే అవుతుంది. 2016 వరకు టీ20ల్లో భారత్ చేతిలో న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు. ఆ తర్వాత 11 మ్యాచ్‌ల్లో ఎనిమిది సార్లు ఓడిపోయింది.
గ్రూపు దశ పూర్తైన తర్వాత పాయింట్ల పట్టికలోని తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ చేరుతాయి. అయితే పాకిస్థాన్ జట్టు ఇప్పటికే ఇండియా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ మీద గెలిచి అగ్రస్థానంతో సెమీస్ చేరడం లాంఛనంగానే ఉంది. భారత్, కివీస్‌లు అఫ్గానిస్థాన్‌తో పాటు పసికూనలు నమీబియా, స్కాట్లాండ్‌లపై గెలుస్తాయనుకుంటే.. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచే రెండో స్థానంతో సెమీస్ చేరే జట్టేదో నిర్ణయిస్తుందన్నమాట. కాబట్టి ఓడిన జట్టు ఇంటిముఖం పట్టినట్లే! పసికూనలున్న ఈ గ్రూపు-2 పేరుకే తేలికైంది. ఒక్క ఓటమితోనే భారత్, కివీస్‌లు ఎదుర్కొంటున్న పరిస్థితి అందుకు నిదర్శనం.
ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్..
ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ అటు ఇండియాతో పాటు.. న్యూజిలాండ్ జట్టుకు కీలకమే! ఈ నేపథ్యంలో ఇందులో గెలుపు కోసం ఇరుజట్లు తీవ్రంగా శ్రమిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే బ్యాటింగ్‌లో న్యూజిలాండ్ ఇబ్బందుల ఎదుర్కోంటోంది. కెప్టెన్ విలియమ్సన్ సరైన ఫామ్‌లో లేడు. ఫిట్‌నెస్ సమస్యలూ ఎదుర్కొంటున్నాడు. గప్తిల్ పాదానికి గాయమైంది. విలియమ్సన్ మ్యాచ్ ఆడటం ఖాయమే కానీ.. గప్తిల్ సంగతే తేలాల్సి ఉంది. కేన్, గప్తిల్‌లతో పాటు మిచెల్, కాన్వే, ఫిలిప్స్, నీషమ్, సీఫర్ట్‌లతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా కనిపిస్తోంది. నీషమ్, శాంట్నర్ బ్యాటుతో, బంతితో బాగా ఉపయోగపడతారు. అయితే బ్యాట్స్‌మెన్‌లో ఎవ్వరూ అంత జోరు మీద లేకపోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం. సరైన ఫినిషర్ లేకపోవడం కూడా ఆ కివీస్ సమస్యే. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలంటే భారత బౌలర్లు ప్రణాళికలకు తగినట్లు బౌలింగ్ చేయాలి.
జస్పీత్ బుమ్రా, షమీ అంచనాలకు తగ్గట్లు చెలరేగడం టీమ్ఇండియాకు కీలకంగా మారనుంది. మరోవైపు భువనేశ్వర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను తీసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. పాక్‌పై ప్రభావం చూపలేకపోయిన వీళ్లు గాడిన పడితే టీమ్ఇండియాకు ఎదురుండదు. స్పిన్నర్లు వరుణ్, జడేజా కూడా మాయ చేయాలని జట్టు ఆశిస్తోంది. ఇక రాహుల్, రోహిత్, కోహ్లి, సూర్యకుమార్, రిషబ్ పంత్, జడేజా, హార్దిక్‌లతో బలంగా కనిపిస్తోన్న బ్యాటింగ్ లైనప్.. ఈ మ్యాచ్‌లోనైనా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తుందేమో చూడాలి. న్యూజిలాండ్ బౌలర్లు సౌథీ, బౌల్ట్ కీలక మ్యాచ్‌ల్లో గొప్పగా బౌలింగ్ చేస్తారు. వారికి భారత బ్యాట్స్‌మెన్‌పై మంచి అవగాహన ఉంది. శాంట్నర్, ఇష్ సోధీలతో కివీస్ స్పిన్ కూడా బాగానే ఉంది.
Also Read: Virat Kohli Slams Trolls: షమీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. మద్దతుగా నిలిచిన కెప్టెన్ కోహ్లీ
Also Read: T10 League 2021 Coaches: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. పురుషుల జట్టుకు మహిళా కోచ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook