న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 13లో విదేశీ క్రికెటర్లు లేకుండానే ఆయా ఫ్రాంచైజీలు బరిలోకి దిగనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వీసాలను ఏప్రిల్ 15 వరకు నిషేధించింది. మరోవైపు మార్చి 29న ఐపీఎల్ 2020 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. విదేశీయులను దేశంలోకి అనుమతించడంపై నిషేధం ఉన్న సమయంలోనే ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తొలి రెండు వారాలు విదేశీ క్రికెటర్ల మెరుపులు చూడలేరు.
ఐపీఎల్ నిర్వహణపై స్పష్టత ఎప్పుడంటే!
ఈ విషయంపై బీసీసీఐ ప్రతినిధి ఒకరు గురువారం పీటీఐతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విదేశీయులకు వీసాలను ఏప్రిల్ 15వరకు నిషేధించింది. బిజినెస్ వీసా కేటగిరిలో విదేశీ క్రికెటర్లు భారత్కు రావడం కుదరదు. కేంద్రం నిర్ణయం ప్రకారం.. విదేశీ క్రికెటర్లు నిర్ణీత గడువు వరకు అందుబాటులో ఉండరు. ఐపీఎల్ జట్లు స్టార్ క్రికెటర్లు లేకుండా, కేవలం భారత క్రికెటర్లతోనే సీజన్ ప్రారంభించనున్నారు. కాగా, ప్రాణాంతక కరోనా వైరస్ నేపథ్యంలో అసలు షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం అవుతుందా లేదా అనే దానిపై స్పష్టత కరువైంది.
Also Read: సన్ రైజర్స్ హైదరాబాద్ IPL 2020 షెడ్యూల్.. SRH తొలి మ్యాచ్ ఎవరితో!
ఐపీఎల్ పాలక మండలి మార్చి 14న సమావేశమై కీలక నిర్ణయం తీసుకోనుంది. శనివారం మీటింగ్ తర్వాత ఐపీఎల్ వాయిదా పడుతుందా లేక నిర్ణీత షెడ్యూలు ప్రకారమే జరగుతుందా అనేది తేలనుంది. భారత్లో 73 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, ప్రపంచ వ్యాప్తంగా 4వేలకు పైగా కరోనా మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.