IPL 2023: అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్డేడియం. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్. ఐపీఎల్ 2023 తుది పోరు. వర్షం అడ్డంకిగా మారడంతో ఓవర్లు కుదించి చెన్నైకు భారీ లక్ష్యం విధించినా..చివరి వరకూ పోరాడి విజయం సాధించింది మహీ సేన. ఐదవసారి టైటిల్ గెల్చుకుని..రెండోసారి టైటిల్ సాధించాలనే గుజరాత్ టైటాన్స్ ఆశలపై నీళ్లు చిమ్మింది.
ఐపీఎల్ 2023 ఫైనల్ పోరు రసవత్తరంగా సాగుతోంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు బౌలింగ్ తీసుకుంది. బ్యాటింగ్ బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచి ధాటిగా ఆడింది. శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చారు. క్వాలిఫయర్ 2లో చెలరేగిన శుభమన్ గిల్‌ను చెన్నై ఆదిలోనే నిలువరించగలిగింది. అయితే ఈసారి శుభమన్ గిల్ స్థానంలో సాయి సుదర్శన్ చెలరేగిపోయాడు. ఏ దశలోనూ చెన్నై బౌలర్లు సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహాల హిట్టింగ్‌ను అడ్డుకోలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అనంతరం 215 పరుగుల లక్ష్యంతో చెన్నై సూపర్‌కింగ్స్ ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డేవన్ కాన్వేలు బరిలో దిగారు. మూడు బాల్స్ ఆడారో లేదో భారీ వర్షం ప్రారంభమైంది. పిచ్ పూర్తిగా తడిసిపోవడంతో వర్షం ఆగినా వెంటనే ప్రారంభం కాలేదు. ఆ తరువాత 12.10 గంటలకు మ్యాచ్ ప్రారంభించారు. అయితే 15 ఓవర్లకు కుదించి టార్గెట్‌ను 171 పరుగులకు ఫిక్స్ చేశారు. తిరిగి ఇన్నింగ్స్ ప్రారంభం కాగానే రుతురాజ్ గైక్వాడ్, డేవన్ కాన్వేలు శుభారంభం ఇచ్చారు. తొలి 4 ఓవర్లలోనే 50 పరుగులు పూర్తి చేశారు. ఆ తరువాత స్కోర్ 79 పరుగుల వద్ద ఉండగా రుతురాజ్ గైక్వాడ్ ఆ తరువాత డేవన్ కాన్వేలు అవుట్ అయ్యారు. ఆ తరువాత బరిలో వచ్చిన శివమ్ దూబే, అజింక్యా రహానేలు ఇన్నింగ్స్ చక్కదిద్దారు. స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించిన అజింక్యా రహానే కాస్సేపటికి వెనుదిరగడంతో చెన్నై సూపర్‌కింగ్స్ కష్టాల్లో పడింది. రిక్వైర్డ్ రన్‌రేట్ ఏకంగా 15కు చేరుకుంది. ఆ తరువాత బరిలో దిగిన అంబటి రాయుడు అద్భుతంగా విరుచుకుపడ్డారు. ఓ దశలో మ్యాచ్ ఫినిషింగ్ ఇస్తారనుకున్నారు. 13 బంతుల్లో 22 పరుగులకు తీసుకొచ్చేశారు.
మరో షాట్‌కు ప్రయత్నిస్తూ అవుట్ కావడంతో నిరాశ ఆవహించిది. రాయుడు స్థానంలో బరిలో దిగిన కెప్టెన్ ధోనీ తొలి బౌల్కే వెనుదిరగడంతో అందరూ షాక్ అయ్యారు. శివమ్ దూబే, రవీంద్ర జడేజాలు బరిలో మిగిలారు. చివరి ఓవర్‌కు 13 పరుగులు అవసరమైన పరిస్థితి. మోహిత్ శర్మ మొదటి బాల్ యార్కర్ పరుగులేమీ రాలేదు. 5 బంతుల్లో 13 పరుగులు అవసరమయ్యాయి. తరువాతి బంతికి కేవలం ఒక్క పరుగు లభించింది. ఇంకా 4 బంతుల్లో 12 పరుగుల గెలుపుకు అవసరం. మరో బంతికి కూడా ఒకే పరుగు లభించింది. 3 బంతుల్లో 11 పరుగులు కొట్టాలి. ఆ తరువాతి బంతికి కూడా ఒకే పరుగు లభించింది. చివరి 2 బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా రవింద్ర జడేజా సిక్సర్ కొట్టారు. ఇక ఒకే ఒక బంతి మిగిలింది. 4 పరుగులు అవసరమయ్యాయి చెన్నైకు. చివరి బంతిని బౌండరీకు తరలించి అద్భుత విజయాన్ని అందించాడు.
చెన్నై సూపర్‌కింగ్స్ ఐదవసారి టైటిల్ సాధించింది. రెండోసారి టైటిల్ కొట్టాలన్న గుజరాత్ టైటాన్స్ ఆశలపై నీళ్లు చిమ్మేసింది. ధోనీ సేన ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెల్చుకుని ముంబై ఇండియన్స్ రికార్డు సమం చేసింది. స్టేడియం అంతా పసుపుమయమై..మార్మోగిపోయింది. మ్యాచ్ జరిగింది అహ్మదాబాద్‌లోనే అయినా చెన్నైకే ఎక్కువ మద్దతు కన్పించింది.
Also read: Who Is Sai Sudharsan: చెన్నైకి చుక్కలు చూపించిన సాయి సుదర్శన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook