వర్షం కారణంగా తడిసి ముద్దైన మైదానాన్ని హెలీకాప్టర్లతో ఆరబెట్టడం ఎక్కడైనా, ఎప్పుడైనా చూశారా ? చూడకపోతే ఇదిగో ఈ వీడియో చూడండి. పాకిస్థాన్‌లోని లాహోర్ గడాఫి స్టేడియంలో బుధవారం చోటుచేసుకున్న ఈ దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఓ వైరల్ వీడియో అయ్యింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో భాగంగా కరాచి కింగ్స్, పెషావర్ జల్మి జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరగాల్సి వుండగా వరుణుడు మైదానాన్ని ఓ ఆట ఆడేసుకున్నాడు. దీంతో తడిసి ముద్దైన మైదానం కారణంగా మ్యాచ్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగిపోకూడదు అని భావించిన పీఎస్ఎల్ నిర్వాహకులు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) సహాయంతో రెండు హెలీకాప్టర్లను తీసుకొచ్చి అతి తక్కువ ఎత్తులో మైదానంపై తిప్పారు.
Helicopter here at the Gaddafi Stadium to make the field dry. #HBLPSL pic.twitter.com/JUibYzrIyx
— Mazher Arshad (@MazherArshad) March 21, 2018
ఈ రెండు హెలీకాప్టర్లలో ఒకటి పంజాబ్ ప్రభుత్వం సమకూర్చగా మరొకటి పాకిస్థాన్ ఆర్మీ పంపించింది. గతంలో అంటే, 1996లో క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ జరుగుతున్న సమయంలో ఇదే స్టేడియంలో ఓసారి ఇలాగే హెలీకాప్టర్లతో మైదానాన్ని ఆరబెట్టిన పీసీబీ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత స్డేడియాన్ని ఆరబెట్టడం కోసం హెలీకాప్టర్లను రంగంలోకి దింపింది. 1996లో శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్ లో శ్రీలంక కప్ గెల్చుకున్న సంగతి తెలిసిందే.