పర్యావరణ పరిరక్షణకు మొక్కలు చాలా కీలకం అని చాటిచెబుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'హరితాహారం' కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. హరితహారంలో భాగంగా చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌కు అనూహ్య మద్దతు లభిస్తోంది. సోషల్ మీడియాలో రాజకీయ నాయకులు, ప్రముఖులు ఛాలెంజ్‌ను విసురుకుంటూ, స్వీకరిస్తూ మొక్కలను నాటుతున్నారు. తెరాస ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్, సినీ దర్శకుడు రాజమౌళి, క్రీడాకారిణి సైనా నెహ్వాల్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా, మోహన్ బాబు, బ్రహ్మానందం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజాగా హరితాహారం (గ్రీన్) ఛాలెంజ్‌ను సినీ నటుడు మహేశ్ బాబు స్వీకరించారు. మంత్రి కేటీఆర్, రాచకొండ పోలీసులు విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన మహేశ్ సోమవారం తన కూతురు సితారతో కలిసి మొక్కలు నాటారు. దీనికి సంబంధించిన ఫొటోలను తన ట్విటర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. రాష్ట్రం పచ్చగా ఉండేందుకు జరుగుతున్న కార్యక్రమంలో తనను భాగస్వామిగా చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అటు డైరెక్టర్ వంశీ పైడిపెల్లిని, తన కూతురు సితార, కుమారుడు గౌతమ్‌లను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నట్లు మహేశ్ వెల్లడించారు.
Challenge accepted, @KTRTRS & @RachakondaCop 😊 Thank you for nominating me...👍 #HarithaHaram is a great initiative taken towards a go green environment. I now nominate my daughter Sitara, my son Gautam and my @directorvamshi to take on the challenge. pic.twitter.com/SEhcuM4Dgy
— Mahesh Babu (@urstrulyMahesh) July 30, 2018