CM KCR speech in TRS plenary 2022: తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి తన పంథా మార్చేశారా ? ఇన్నాళ్లుగా వేసిన ప్లాన్‌ను దారి తప్పించారా ? దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై సునిశిత దృష్టి సారించారా ? అందుకే తనదైన ఫ్రంట్ నినాదాన్ని ప్లీనరీ ప్రసంగంలో దాచి పెట్టారా ? రాజకీయ వ్యూహాల్లో చతురుడిగా పేరుగాంచిన కేసీఆర్ ప్లీనరీ ప్రసంగాన్ని ఆసాంతం గమనించిన వాళ్లు, దృష్టిపెట్టిన పరిశీలకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది.
కొన్నేళ్లుగా థర్డ్ ఫ్రంట్, జాతీయ రాజకీయాల అంశాన్ని కేసీఆర్ ప్రధానంగా తన ప్రసంగాల్లో వినిపిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా నేషనల్ పాలిటిక్స్‌లో ప్రధాన పాత్ర పోషించనున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో ఆదరించినట్లే.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేలా ఆశీర్వదించాలని కూడా తెలంగాణ ఓటర్లను స్వయంగా అభ్యర్థించిన సందర్భం కూడా ఉంది.
ఇక, కొంతకాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేను నడిపిస్తున్న ప్రధాన పార్టీ అయిన బీజేపీతో, ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీతో విభేదిస్తున్న కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ దిశగా కొన్నాళ్లు వడివడిగా అడుగులు వేశారు. ఉత్తర భారత పర్యటనలు నిర్వహించారు. బీజేపీతో విభేదించే వివిధ పార్టీల నేతలతో పాటు.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలిశారు. ప్రెస్‌మీట్లు పెట్టి మరీ కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేస్తానని, బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తానని బాహాటంగా ప్రకటించారు. ఆ తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగ్గా బీజేపీ జోరు తగ్గలేదన్న విషయం ప్రస్ఫుటమయ్యింది. దీంతో, కేసీఆర్ పర్యటనల ఊసు కూడా వినిపించకుండా పోయింది.
పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో కేసీఆర్ ప్రసంగం హాట్ టాపిక్ అయ్యింది. కేంద్రంపై సమరం, ప్రత్యామ్నాయ కూటమి పేరుతో పర్యటనలు, ఆయా సభల్లో ప్రకటనల నేపథ్యంలో ప్లీనరీ వేదికగా కేసీఆర్ చేసే ప్రకటన కీలకంగా ఉండబోతోందని అందరూ ఎదురుచూశారు. కానీ, కేసీఆర్ ప్రసంగంలో ఎక్కడా ఫ్రంట్ మాటెత్తలేదు. టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేదిక సాక్షిగా కేసీఆర్ ప్రత్యామ్నాయ ఎజెండా అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు.
సాధారణంగా ప్రత్యర్థుల ఎత్తులను కేసీఆర్ చిత్తు చేస్తారన్న ప్రచారం ఉంది. సందర్భానుసారంగా, పరిస్థితులకు అనుకూలంగా ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగిస్తారన్న పేరుంది. ఈ క్రమంలోనే కేసీర్ ప్లీనరీ వేదికగా ఏం చెబుతారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే, అందరి దృష్టీ ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ను ఏవిధంగా ముందుకు తీసుకెళ్తారనే అంశంపైనే ఉండగా.. కేసీఆర్ మాత్రం ప్రత్యామ్నాయ వేదిక అంటూ ప్రసంగం తీరును మార్చేశారు. దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండాతో, కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని, తెలంగాణ ఆకాంక్షల కోసం టీఆర్‌ఎస్ ఎలా ఆవిర్భవించిందో, దేశంకోసం కూడా ఓ శక్తి పుడుతుందని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో కొత్త ఎజెండా, సిద్ధాంతం రూపొందిస్తే.. దేశం నలుమూలలకూ ఆ సిద్ధాంతం వ్యాపిస్తే దేశానికే గర్వకారణంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా ఆ ఎజెండా ఉండాలని ఆకాంక్షించారు. ప్రత్యామ్నాయ ఫ్రంట్ కాదని, ప్రత్యామ్నాయ ఎజెండా అవసరం ఉందని స్పష్టం చేశారు. అయితే, ఆ ఎజెండా ఎలా రూపొందిస్తారో, ఎలా ముందుకు వెళ్తారో అనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా... రాజకీయ ఫ్రంట్లు కాదు : సీఎం శ్రీ కేసీఆర్.#21YearsOfTRS pic.twitter.com/zgtayV2ljA
— TRS Party (@trspartyonline) April 27, 2022
కేసీఆర్ ప్రసంగంలో ఈ మార్పుకు కారణం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే అన్న విశ్లేషణలు సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉన్న ఆదరణ కోల్పోతుండటం, బీజేపీ క్షేత్రస్థాయిలో పుంజుకుంటుండటంతో కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలను ఏకంచేసే ప్రయత్నం వృథా అన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. అలా కాకుండా.. సొంతంగా ఎజెండాను రూపొందించుకోవాలన్న భావనలో ఉన్నట్లు కేసీఆర్ ప్రసంగాన్ని గమనిస్తే అర్థమవుతుంది. అందుకే హైదరాబాద్ వేదికగా ఎజెండా రూపొందితే గర్వకారణమన్న మాటలను కేసీఆర్ (CM KCR) వల్లె వేశారు.
Also read : AP CM YS Jagan: ఎన్నికల ప్లాన్ బయటపెట్టిన సీఎం జగన్
Also read : Minister Puvvada Ajay about Revanth Reddy: రేవంత్ రెడ్డి సవాల్‌పై స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.