MLC Kavitha name in Delhi Liquor Scam Case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ సర్కారు ఎక్సైజ్ పాలసీలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని.. ఈ ఎక్సైజ్ స్కామ్‌లో కోట్ల రూపాయలు చేతులు మారగా.. అందులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా ప్రమేయం ఉందని ఢిల్లీకి చెందిన బీజేపి ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజిందార్ సిర్సా చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఢిల్లీ బీజేపి నేతలు చేసిన ఈ ఆరోపణలతో కల్వకుంట్ల కవిత పేరు నేషనల్ హెడ్ లైన్స్‌కి ఎక్కింది. దీంతో ఈ వివాదంపై సోమవారమే స్పందించిన కల్వకుంట్ల కవిత.. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేరును బద్నాం చేయడానికే ఇందులోకి తన పేరుని లాగుతున్నారని అన్నారు. ఇదిలావుంటే తాజాగా తనపై నిరాధార ఆరోపణలు చేసిన బిజేపి ఎంపీ పరవేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ సిర్సాపై ఎమ్మెల్సీ కవిత కోర్టును ఆశ్రయించారు.
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో 9వ చీఫ్ జడ్జి ఎదుట ఇంజక్షన్ పిటిషన్ దాఖలు చేసిన కవిత.. ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం వాటిల్లేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేశారని తన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజల్లో తనకు ఉన్న మంచి పేరు - ప్రతిష్టలను చెడగొట్టడానికి బీజేపి నేతలు చేసిన కుట్రగా ఎమ్మెల్సీ కవిత అభివర్ణించారు. సదరు బీజేపి నేతలు చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేనందున.. వాళ్లు తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించాల్సిందిగా ఎమ్మెల్సీ కవిత తన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు.