దాదాపు రెండు వారాల వ్యవధి తర్వాత హైదరాబాద్లో గురువారం సాయంత్రం వాతావరణం చల్లబడింది. సిటీలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు భారీ వర్షం కురిసింది. అనుకోకుండా కురిసిన వర్షం భారీ ఉష్ణోగ్రతల నుంచి ఇబ్బందులు పడుతున్న వారికి కొంత ఆహ్లాదాన్ని ఇచ్చినా.. ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగస్తులు, వాహనదారులను మాత్రం ఇబ్బందులపాలు చేసింది. భారీవర్షంతో రోడ్లపైకి నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బోరబండ, మాదాపూర్, మియపూర్ చందానగర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, చిక్కడపల్లి, ముషీరాబాద్, నారాయణగూడ, ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, నల్లకుంట, ఓయూ, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సైదాబాద్, చాదర్ ఘాట్, మలక్పేట్, చంపాపేట్ పరిసర ప్రాంతాల్లో భారీగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అనుకోకుండా కురిసిన భారీ వర్షంతో గురువారం రాత్రి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.