కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ని గజ్వేల్‌లో ఓడించేందుకు రంగం సిద్ధం చేయాలని.. స్వయంగా తనకు తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారని ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రైవేటు నెంబరు నుండి ఆయన ఫోన్ చేశారని ప్రతాప్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకు కావాల్సిన ఆర్థిక సహాయం తాను అందిస్తానని.. కానీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించాలన్నది ప్రధాన ఎజెండా కావాలని హరీష్ రావు తెలిపినట్లు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ అన్ని బాధ్యతలనూ కేటీఆర్‌కే అప్పగిస్తున్నారని.. కష్టపడి పనిచేస్తున్నా తనను పక్కన పెడుతున్నారని హరీష్ అంటున్నారని ప్రతాప్ రెడ్డి తెలిపారు. అయితే హరీష్ రావు ఇన్ని మాటలు చెప్పినా సరే తాను ఆ మాటలకు లొంగలేదని.. హరీష్ రావు ఇచ్చే ఆర్థిక సహకారం తనకు అక్కర్లేదని చెప్పానని ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యానించారు. హరీష్ రావు ఇచ్చే డబ్బుతో గెలవాల్సిన అవసరం తనకు లేదని.. గజ్వేల్‌లో తనకు విజయం ఖాయమని ప్రతాప్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
గజ్వేల్‌లో కేసీఆర్ కుటుంబం మొత్తం వచ్చి ప్రచారాలు చేసినా తనకు ఇబ్బంది ఏమీ లేదని.. తాను గెలిచి తీరుతానని ఒంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. హరీష్ రావు తనతో చేసిన వ్యాఖ్యలు అబద్ధాలు కాదని.. పచ్చి నిజాలని.. దేవుడి మీద ఒట్టు వేసి మరీ తాను చెబుతున్న ఈ సంగతిని అందరూ నమ్మాలని ప్రతాప్ రెడ్డి ప్రజలను కోరారు. హరీష్ రావు కూడా త్వరలో టీఆర్ఎస్ గూటిని వీడి.. కాంగ్రెస్ కండువా కప్పుకొనే అవకాశం ఉందని కూడా ఒంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్గతంగా పోరు మొదలైందని.. అందుకే హరీష్ రావు పార్టీ వీడే అవకాశం ఉందని ప్రతాప్ రెడ్డి జోస్యం చెప్పారు.