Prashant Kishor Meets CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. గజ్వేల్ ఎర్రవల్లిలోని సీఎం ఫాంహౌస్‌లో ప్రశాంత్ కిశోర్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణతో పాటు దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కేసీఆర్, ప్రశాంత్ కిశోర్ చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టడంతో పాటు జాతీయ రాజకీయాల్లోకి తన ఎంట్రీకి సంబంధించిన పలు అంశాలపై కేసీఆర్ పీకే మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.
ప్రశాంత్ కిశోర్ తనతో కలిసి పనిచేస్తానని చెప్పారని.. త్వరలోనే గోవా నుంచి వస్తారని కొద్దిరోజుల క్రితం సీఎం కేసీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన పీకే.. అక్కడ ఎన్నికలు ముగియడంతో తెలంగాణకు వచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం పీకే రూట్ మ్యాప్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమవనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం త్వరలోనే ఆయన తెలంగాణలో పర్యటిస్తారని చెబుతున్నారు.
ప్రశాంత్ కిశోర్‌తో సీఎం కేసీఆర్ భేటీ సందర్భంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీకి ప్రకాష్ రాజ్‌ను సీఎం ప్రత్యేకంగా ఆహ్వానించినున్నట్లు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూస్తున్న వేళ.. అందుకు తగిన టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో ప్రకాష్ రాజ్ కీలకంగా వ్యవహరించబోతున్నారని.. అవసరమైతే ఆయన్ను రాజ్యసభకు పంపించే యోచనలో కేసీఆర్ ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో భేటీకి ప్రకాష్ రాజ్‌ను సీఎం కేసీఆర్ వెంట తీసుకెళ్లడంతో ఈ ప్రచారం మొదలైంది.
కాగా, 2014లో ప్రశాంత్ కిశోర్ బీజేపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గతేడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీకి, తమిళనాడులో డీఎంకె పార్టీకి ఆయన ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. అంతకుముందు, ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో పీకే సేవలను టీఆర్ఎస్ పార్టీ కూడా ఉపయోగించుకోవాలనుకుంటోంది. ఇందులో భాగంగానే పీకేతో సీఎం కేసీఆర్ భేటీ జరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook