తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు

Last Updated : Oct 22, 2019, 06:20 PM IST
తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు మున్సిపల్‌ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లన్నింటినీ కొట్టేసిన కోర్టు... ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఎన్నికల్లో రిజర్వేషన్లు, వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో అక్రమాలు తదితర అంశాలను సవాలు చేస్తూ గతంలో పలువురు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆయా పిటిషన్లపై గత కొన్ని నెలలుగా హైకోర్టులో విచారణ జరిగింది. ఎట్టకేలకు ఆ పిటిషన్లను కొట్టేసిన కోర్టు.. నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించుకోవాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో మునిసిపల్ ఎన్నికలకు ఉన్న ఏకైక అడ్డంకి తొలగిపోయినట్టయింది.
 
మునిసిపల్ ఎన్నికలకు హై కోర్టు పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో ఏ క్షణమైనా దీనిపై నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లలో కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, బడంగ్‌పేట్, నిజాంపేట్, బండ్లగూడ, మీర్‌పేట్, జవహర్ నగర్ ఉన్నాయి. ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్లకు కాలపరిమితి ఇంకా ముగియలేదు. అలాగే సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీల కాలపరిమితి ఇంకా ముగియనందున ఆ రెండు మున్సిపాలిటీలకు ఇప్పుడే నోటిఫికేషన్ వెలువడే అవకాశం లేదు. ఇక మందమర్రి, మణుగూరు, పాల్వంచ కార్పోరేషన్లలో సాంకేతిక కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించటం లేదు. జడ్చర్ల, నకిరేకల్‌లో గ్రామాల విలీన ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో అక్కడ సైతం ఈసారి ఎన్నికలు నిర్వహించడం లేదు.

Trending News