Telangana Ministry Expansion Exclusive Story: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యం కానుందా..? ఇదిగో విస్తరణ, అదిగో విస్తరణ అంటూ ప్రచారాలే తప్పా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అవుతుందనే దానిపై రాష్ట్ర నేతలకు క్లారిటీ లేదా..? ఎమ్మెల్సీ ఎన్నికలకు మంత్రివర్గ విస్తరణకు లింకు ఉందా..? కేబినెట్ విస్తరణ జరిగితే ఎవరికి బంపర్ ఆఫర్ తగలనుంది..? ఇప్పుడున్న మంత్రుల్లో ఇద్దరికి షాక్ తప్పదా..? మంత్రిపదవులు ఆశిస్తున్న నేతలకు మరి కొద్ది రోజులు ఎదురుచూపులు తప్పవా..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. ఐనా పూర్తి స్థాయి మంత్రివర్గం లేదు. ప్రస్తుతం ఉన్న వారితో పాటు మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతి సారీ దీని గురించే చర్చ జరుగుతుంది. లోక్ సభ ఎన్నికలు గడిచిన నాటి నుంచి కేబినెట్ విస్తరణ అంశంపై ప్రతి రోజు చర్చ జరుగుతూనే ఉంది.
మంత్రి పదవుల కోసం కొందరు నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొందరు నేతలు తమకు రేవంత్ రెడ్డి కేబినెట్ లో బెర్త్ కన్ఫామ్ అయ్యింది. ఇక అధికారికంగా ప్రకటనే మిగిలిందని తమ అనచరుల వద్ద చెప్పుకుంటున్నారు. ఇక మరి కొందరి పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. అప్పుడే తమకు మంత్రి పదవి వచ్చింది. తాము మంత్రులము అయ్యాము అన్నట్లుగా ఆ నేతల తీరు ఉన్నట్లు ఆ జిల్లా నేతలు చెప్పుకుంటున్నారట.
ఇది ఇలా ఉంటే మంత్రివర్గం నెలలు గడుస్తున్నా స్పష్టత రాకపోవడంతో పదవులపై ఆశలు పెట్టకున్న నేతలు ఊసూరుమంటున్నారు. ఇప్పటికే సంవత్సరం గడిచింది. తమకు ఇక మంత్రి పదవులు ఎప్పుడు దక్కుతాయని తమ ఫాలోవర్స్ వద్ద ఆవేదన చెందుతున్నారట. ఇక మరి కొందరు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి, అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఇలాంటి నేతలు ప్రభుత్వం కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారని గాంధీ భవన్ లో చర్చ జరుగుతుంది. మరోవైపు కొందరు నేతలు బహిరంగంగానే పార్టీకీ ఇబ్బంది కలిగే వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలో కాంగ్రెస్ లో పెద్ద పెద్ద కలకలం రేపాయి. తాను బీజేపీలో ఉంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యే వాడా అని ఒక సారి, కాంగ్రెస్ పై తెలంగాణ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని మరో సారి ఇలా రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి పార్టీకీ ఇబ్బందికరంగా మారాయి. మంత్రివర్గంలో రాజ్ గోపాల్ రెడ్డికి అవకాశం దక్కకపోడంతోనే రాజ్ గోపాల్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ లోనే చర్చ జరుగుతుంది..ఇలా నేతలు నెలల తరబడి మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకొని జరగకపోవడంతో వారిలో అసహనం పెరిగిపోతుందని పార్టీలో చర్చించుకుంటున్నారు.
ఐతే మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆలస్యం అవుతుందన్న విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి .అందులో ప్రధానంగా వినిపిస్తుంది మరి కొద్ది రోజుల్లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని గాంధీ భవన్ లో తెగ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయ, పట్టుభధ్రుల ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలయ్యింది. ఫిభ్రవరి చివరి కల్లా ఈ ఎన్నికలు ముగుస్తున్నాయి. ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వీరిలో శాసన సభ్యుల ఆధారంగా ఒకటి బీఆర్ఎస్ కు దక్కే అవకాశం ఉండగా మరో రెండు కాంగ్రెస్ ఖాతాలో పడనున్నాయి. ఈ ప్రక్రియం అంతా కూడా మార్చి నెల చివరాఖరు వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం లేదనే వాదన వినిపిస్తుంది.
ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యే ఎమ్మెల్సీలో ఒకరిద్దరికి మంత్రి పదవులు దక్కవచ్చని అంచనా వేస్తున్నారు.అందుకే అప్పటి వరకు కేబినెట్ విస్తరణ ఉండదనే ప్రచారం జరుగుతుంది. అంతే కాదు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఒక వ్యక్తికి ఎమ్మెల్సీతో పాటు మంత్రి కూడా అవకాశం దక్కనున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు మంత్రివర్గంలో సీనియర్లు, గతంలో మంత్రులుగా పనిచేసిన వారికే మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలా చేస్తే ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని అధిష్టానం పెద్దలు అంచనా వేస్తున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే అని పార్టీలో తెగ చర్చ జరగుతుంది.
మరోవైపు మంత్రివర్గ విస్తరణపై ఆశపెట్టుకున్న నేతల ఆశలు అడియాశలు అవుతున్నాయి. దీంతో ఆ నేతల్లో రోజుకింత ఆసహనం పెరిగిపోతుందనే టాక్ నడుస్తుంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ ఆలస్యంపై ఆగ్రహంతో ఉన్న నేతలకు ప్రస్తుతం మరో రెండు నెలల వరకు మంత్రివర్గ విస్తరణ ఉండదు అనే ప్రచారం మరింత మంటను రేపుతుంది. ప్రస్తుతం ఆ నేతల తీరు పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని కాంగ్రెస్ సర్కిల్ లో తెగ ప్రచారం జరుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter