ఆసియాలో అగ్రదేశం అయిన చైనాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. కరోనా దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా. . కరోనా వైరస్ విస్తృతిని ఆపలేకపోతున్నారు.
కరోనా వైరస్ చైనాలో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. వైరస్ ధాటికి .. ఆస్పత్రులన్నీ రోగులతోనే నిండిపోయి ఉన్నాయి. తాజాగా పెరుగుతున్న మృతుల సంఖ్య చైనాను బెంబేలుపెట్టిస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంహా 1523 మంది మృతి చెందారని .. చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఐతే అనధికారికంగా ఆ సంఖ్య ఇంకా చాలా ఉందని మరో వాదన వినిపిస్తోంది. మరోవైపు చైనాలో మొత్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలతో 66 వేల 442 మంది రోగులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు చైనా వైద్య ఆరోగ్య శాఖ తాజా ప్రకటన చేసింది. కొత్తగా శుక్రవారం రోజున 2 వేల 641 కేసులు నమోదయ్యాయని వివరించింది. ఐతే ఇప్పటి వరకు కరోనా వైరస్ కు చికిత్స చేసి 13 వందల 73 మందిని ఆస్పత్రుల నుంచి విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.