పాకిస్థాన్‌లో నేడు (బుధవారం, 25-07-2018) 11వ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్)కి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్న క్రమంలో.. హింసాత్మక ఘటనలు చెలరేగాయి.
క్వెట్టాలోని ఈస్టర్న్ బైపాస్ వద్ద గల పోలింగ్ బూత్ వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం 22 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు పోలీసులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో 30 మంది గాయపడ్డారని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని స్థానిక మీడియా వెల్లడించింది. పోలీస్ వాహనాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారని నివేదికలు తెలిపాయి.
సింధ్‌లోని లర్కానా నగరంలో ఎన్ఏ-200 నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన పేలుడులో ఐదుగురు గాయపడ్డారు. పేలుడు సంభవించడంతో అక్కడ పోలింగ్‌ను నిలిపివేశారు అధికారులు.
మరోవైపు బలూచిస్తాన్‌లోని డెరా మురద్ జమాలి నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఖిప్రో మహిళా పోలింగ్ స్టేషన్ వద్ద రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగిన గొడవల్లో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలతో ప్రశాంతంగా జరగాల్సిన పాకిస్థాన్ ఎన్నికల్లో హింసాత్మక వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు అనుమానితులుగా భావిస్తున్న వారిని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
26/11 పేలుళ్ల ప్రధాన నిందితుడు హాఫిజ్ సయీద్ లాహోర్‌లో తన ఓటుహక్కును వినియోగించుకున్నాడు.
సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది. కేవలం 24 గంటల్లోనే ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. సుమారు 10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.