ఏపీ అసెంబ్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ని కొనియాడిన సీఎం జగన్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును కొనియాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Dec 9, 2019, 08:20 PM IST
ఏపీ అసెంబ్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ని కొనియాడిన సీఎం జగన్

అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును కొనియాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మొదటి రోజు మహిళల రక్షణ అంశంపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. దిశపై దారుణానికి పాల్పడిన హంతకులను కాల్చిచంపినా తప్పులేదని తనకు కూడా అనిపించిందని జగన్ తన మనసులో మాటను సభ సాక్షిగా సభ్యులతో పంచుకున్నారు. అందుకే అంత గొప్ప నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి హ్యాట్సాఫ్ అంటూ ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. నిర్భయ కేసును కూడా సభలో ప్రస్తావించిన సీఎం జగన్.. ఢిల్లీలో నిర్భయపై దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులోనూ హంతకులకు నేటికీ శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా టీడీపీని ఉద్దేశిస్తూ.. గత ప్రభుత్వం హయాంలోనే మహిళలపై అఘాయిత్యాలు, అరాచకాలు పెరిగాయని సీఎం జగన్ ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ తరహా కేసుల్లో బాధితులకు త్వరితగతిన న్యాయం జరగాలంటే చట్టాలు మరింత కఠినంగా మారాల్సిన అవసరం ఉందని జగన్ స్పష్టంచేశారు.

Trending News