అమరావతి: రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ఏపీ సర్కార్ మరో వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకుని.. అవినీతి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై ఓ నివేదిక అందించేందుకు ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్ (ఐఐఎం–ఎ)తో ఏపీ సర్కార్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఐఐఎం-ఎ ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణస్వామి, ఏపీ ఏసీబీ చీఫ్ విశ్వజిత్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
వచ్చే ఫిబ్రవరి మూడో వారం వరకు ఐఐఎం–ఎ బృందం ఏపీలో అధ్యయనం చేసి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.