AP Elections: ఏపీలో ఎన్నికలెప్పుడనేది సర్వత్రా చర్చనీయాంశమౌతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాల్లేవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేసినా జరుగుతున్న పరిణామాలు అలానే అన్పిస్తున్నాయి. ప్రతిపక్షం అంచనాలకు అందకుండా ఉండేందుకే గోప్యం పాటిస్తోందని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్-మే నెలల్లో జరగాల్సి ఉన్నాయి. అయితే గత కొద్దికాలంగా ఏపీలో ముందస్తు గానం విన్పిస్తోంది. ప్రభుత్వం గానీ, ప్రభుత్వ పెద్దలు గానీ ఈ విషయాన్ని కొట్టిపారేసినా జరుగుతున్న పరిణామాలు అలానే కన్పిస్తున్నాయి. గత కొద్దికాలంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలు తీర్చే ప్రయత్నాలు అన్నీ ముందస్తుకు సానుకూలంగా ఉంటున్నాయి. ఇటీవల కేంద్రం నుంచి వరుసగా రెండు పర్యాయాలుగా పెద్దమొత్తంలో వెలువడిన ఆర్ధికపరమైన చేయూత ప్రభుత్వానికి సానుకూలంగా ఉంది.
రేపు జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశంలో కాంటాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయడం, ఉద్యోగుల పీఆర్సీ, పెండింగ్ ఎరియర్ల చెల్లింపుపై కేబినెట్ ఆమోదముద్ర వేయవచ్చు. ఇవే జరిగితే ప్రభుత్వానికి చాలాకాలంగా ఉన్న కీలకమైన సమస్యలన్నీ తీరినట్టే. గత కొద్దికాలంగా ప్రభుత్వం ముందున్న వివిధ సమస్యలకు కేబినెట్ సమావేశంలో చెక్ పెట్టగలిగితే ఎన్నికలకు సానుకూల వాతావరణం ఏర్పడవచ్చు. ఎందుకంటే సంక్షేమ పథకాల అమలు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఉద్యోగులు, ఉద్యోగాల సమస్య తీర్చినట్టైతే అంతా అనుకూలంగా ఉండవచ్చు.
అయితే ముందస్తుకు వెళ్లాలంటే డిసెంబర్ నెలలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో జరిపించాల్సి ఉంటుంది. ఆరు నెలల ముందు నుంచే దీనికి సంబంధించి ఈసీ సన్నాహాలు ప్రారంభించాల్సి ఉంది. డిసెంబర్‌లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ ఇటీవలే సన్నాహాలు ప్రారంభించింది. ఎన్నికల తేదీలు కూడా దాదాపుగా నిర్ణయించేసింది. అందుకే ముందస్తుకు వెళ్లే యోచన ఉంటే ఏపీ ప్రభుత్వం కూడా ఈ నెలలోనే నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది. ముందస్తుపై కేంద్ర ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చర్చించినట్టుగా సమాచారం.
ముందస్తు ఉండదని ఏపీ ప్రభుత్వం చెప్పడానికి కారణాలున్నాయి. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షాల పొత్తులు, సీట్ల సర్దుబాట్లు, ఓట్ల బదిలీ వంటివాటిపై ప్రతిపక్షాలు సిద్ధం కాకముందే ఎన్నికలకు సై అంటే ప్రతిపక్షాలు కోలుకునేందుకు సమయం పడుతుంది. అందుకే ప్రభుత్వం పైకి లేవని చెబుతున్నా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలన్నీ ముందస్తుకు అనుకూలంగా ఉంటున్నాయి.
Also read: CM YS Jagan Mohan Reddy: పోలవరం పనులను పరిశీలించిన సీఎం జగన్.. డయాఫ్రం వాల్‌ను పూర్తిచేయాలని ఆదేశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook