ఆంధ్రప్రదేశ్‌లో 220 ఉర్దూ ప్రాథమిక పాఠశాలలను అప్పర్ ప్రైమరీ స్కూళ్ళుగా అప్ గ్రేడింగ్ చేస్తున్నట్లు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సుధారాణి పంపించిన సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు అంగీకరించి 53.49 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టుకు గాను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
అలాగే ఈ అప్ గ్రేడింగ్‌లో భాగంగా కొత్తగా 660 తరగతి గదుల నిర్మాణానికి కూడా ప్రభుత్వం మొగ్గు చూపింది. అలాగే అప్ గ్రేడింగ్ అయ్యే పాఠశాలలకు గాను కొత్తగా 660 టీచర్లను కూడా నియమించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ టీచర్ల పోస్టులలో 220 గణిత టీచర్ల పోస్టులకు, 220 సోషల్ టీచర్ల పోస్టులకు కూడా త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో పాఠశాల విద్య డైరెక్టర్ సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్టు నిర్వాహకులకు, డీఈఓలకు నిబంధనావళిని పంపించినట్లు సమాచారం. అప్ గ్రేడింగ్ అయ్యే పాఠశాలలలో ఆరవ, ఏడవ తరగతులకు అడ్మిషన్లు జరగనున్నాయి.