Chandrababu Case: తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టైన్ చంద్రబాబుకు నిరాశ ఎదురైంది. సుప్రీంకోర్టు నుంచి దేశంలోనే టాప్ న్యాయవాదులొచ్చి వాదించినా ఫలితం లేకపోయింది. సీఐడీ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు సెపెంబర్ 22 వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం నుంచి కోర్టులో జరిగిన పరిణామాల గురించి పరిశీలిద్దాం..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ వర్సెస్ బెయిల్ కేసులో దాదాపు 8 గంటల వాదనలు, 13 గంటల నిరీక్షణకు తెర తొలగింది. నిన్న ఉదయం 6 గంటలకు నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు..ఇవాళ ఉదయం 6 గంటలకు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. చంద్రబాబు తరపున వాదించేందుకు ఢిల్లీ సుప్రీంకోర్టు నుంచి న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా అండ్ టీమ్ చేరుకుంది. ఓపెన్ కోర్టు విచారణకు చంద్రబాబు న్యాయవాదులు అనుమతి కోరగా..కోర్టు అంగీకరించింది. ఆ తరువాత ప్రారంభమైన వాదనలు జోరుగా కొనసాగాయి.
చంద్రబాబు తరపున సిద్ధార్ధ్ లూథ్రా అండ్ టీమ్, సీఐడీ తరపున అడ్వకేట్ట జనరల్ సుధాకర్ రెడ్డి, వివేకాచారి వాదనలు కొనసాగించారు. మద్యాహ్నం 3 గంటలవరకూ ఇరు పక్షాల మధ్య తీవ్ర వాదోపవాదనలు జరిగాయి.
చంద్రబాబును కోర్టులో హాజరుపర్చిన వెంటనే...సీఐడీ పోలీసులు చంద్రబాబు అరెస్టుకు సంబంధించి అతని పాత్రను వివరిస్తూ 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ కోర్టులో సమర్పించారు. ఎఫ్ఐఆర్‌లో కొత్తగా పేరు చేర్చుతూ మెమో కూడా సమర్పించింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన వాదనలు ఎన్నడూ లేనంతగా సుదీర్ఘంగా దాదాపు 7-8 గంటలసేపు కొనసాగాయి. ఈ వాదనల్లో కీలకమైన అంశాలు వెలుగుచూశాయి.
2021లో కేసు నమోదైతే ఇప్పటి వరకూ అరెస్టు చేయకపోవడం, కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాధమిక ఆధారాలు ఉన్నాయా లేవా అనే అంశం, ఎఫ్ఐఆర్‌లో ఎందుకు పెట్టలేదు వంటి కీలకమైన అంశాలపై కోర్టు సీఐడీని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా అన్ని వివరాలు రిమాండ్ రిపోర్టులో సవివరంగా ఉన్నాయని సీఐడీ న్యాయవాదులు తెలిపారు.
ఇవాళ చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రధానంగా చంద్రబాబుని నిబంధనల ప్రకారం 24 గంటల్లోగా కోర్టులో హాజరుపర్చలేదని ఓ వైపు, సెక్షన్ 409 వర్తించదనే అంశంపైనే ఎక్కువగా దృష్టి సారించారు.
చంద్రబాబు వాదనలు
అటు చంద్రబాబు తన వాదనల్ని స్వయంగా విన్పించారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఏర్పాటు అనేది తన నిర్ణయం కాదని, ప్రభుత్వం నిర్ణయమని, అసెంబ్లీలో తీర్మానం కూడా చేసినందున ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తగవని చంద్రబాబు వాదించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు 2015-16లో బడ్జెట్ కూడా పొందుపరిచామన్నారు. 2021 డిసెంబర్ 9న నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో, రిమాండ్ రిపోర్ట్‌లో తన పేరెక్కడా లేదని చంద్రబాబు వివరించారు. ఈ కేసులో తనను అరెస్టు చేయడం అక్రమమని, తనకెలాంటి సంబంధం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ కేసు మొత్తం రాజకీయ ప్రేరేపితమైందని, ఈ అరెస్టు చెల్లదని సిద్ధార్ధ్ లూథ్రా వాదించారు. సెక్షన్ 409, సెక్షన్ 17 ఈ కేసులో చంద్రబాబుకు వర్తించవనే అంశంపై లూథ్రా దాదాపు 2 గంటల సేపు వాదనలు విన్పించారు. సీఐడీ తరపున సుధాకర్ రెడ్డి మాత్రం ఈ కేసులో సెక్షన్ 409 కచ్చితంగా వర్తిస్తుందని వాదించారు. ఇలా దాదాపు 8 గంటల సేపు అంటే మద్యాహ్నం 3 గంటలవరకూ వాదనలు కొనసాగాయి. అనంతరం ఏసీబీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
దాదాపు 4 గంటల నిరీక్షణ, ఉత్కంఠ అనంతరం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తన తీర్పు ప్రకటించారు. సీఐడీ చేసిన వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. నేరపూరిత కుట్రకు చంద్రబాబు పాల్పడ్డారనేందుకు ప్రాధమిక ఆధారాలున్నాయని చెప్పిన న్యాయమూర్తి...చంద్రబాబుకు సెక్షన్ 409 వర్తిస్తుందని స్పష్టం చేశారు. అందుకే 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్టు తెలిపారు.
Also read: Chandrababu Remand: నరాలు తెగే ఉత్కంఠకు తెర.. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook