Chiranjeevi To Join BJP ?: ఏపీలో మోడీ పర్యటన తరువాత పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తుల మీద ఏపీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాకపోవడంతో బీజేపీ, టీడీపీ దోస్తీ కట్ అయినట్టే అని సిగ్నల్స్ వెళ్లాయి. మరోవైపు జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తాయని రెండు పార్టీల నేతలు వెల్లడిస్తున్నారు. అయితే మోడీ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇవ్వడంతో ప్రస్తుతం ఇదే అంశంపై రాష్ట్రంలో రాజకీయ చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో అంటీముట్టనట్లు ఉంటున్న చిరు.. ఇప్పుడిలా ప్రధాని మోడీ పర్యటనలో కనిపించడం అందరిని ఆశ్చర్యపరిచింది. మరోవైపు ఇటీవల ఇండస్ట్రీ సమస్యల మీద పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో వరుస భేటీలు కావడంతో చిరంజీవి పార్టీ మారుతారా అనే చర్చ కూడా జరిగింది.
కొంతకాలంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో సన్నిహితంగా మెలగడంతో చిరు కాంగ్రెస్ నుండి వైసీపీలోకి జంప్ అవుతారన్న చర్చ నడిచింది. కానీ తాను ఇండస్ట్రీలో ఉన్న సమస్యల మీద చర్చించడానికే జగన్ మోహన్ రెడ్డిని కలిశానని, రాజకీయ భేటి గాని రాజకీయ అంశాలు కానీ తమ భేటీలో చర్చకు రాలేదని చిరంజీవి అప్పట్లోనే వివరణ ఇచ్చారు. అయితే మొన్నటి మోడీ పర్యటనలో చిరు ఎంట్రీ ఇవ్వడంతో మరోసారి చిరు పొలిటికల్ లైఫ్ మీద చర్చ నడుస్తోంది. చిరు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్‌లో చర్చగా జోరుగా సాగుతోంది. మోడీ పర్యటనలో పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిరంజీవిని ఆహ్వానించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి పనిచేయడం, సినీ ఇండస్ట్రీలో పెద్ద దిక్కు కావడంతోనే మోడీ పర్యటనకు ఆహ్వానం వెళ్లిందని బీజేపీ, వైసీపీ నేతలు చెబుతున్నప్పటికీ.. చిరంజీవి పార్టీ మారుతారన్న చర్చకు మాత్రం తెరపడటం లేదు.
మరోవైపు ప్రధాని మోడీ ఏపీ పర్యటనలో చిరు ఎంట్రీ జనసైనికులకు సైతం మింగుడు పడడం లేదు. మోడీ టూర్లో రావాలని జనసేనకు ఆహ్వానం ఉన్నప్పటికీ జగన్‌తో కలిసి వేదిక పంచుకోవడం ఇష్టం లేకే పవన్ కళ్యాణ్ మోడీ టూర్‌కు దూరంగా ఉన్నట్లు టాక్. ఇదే సమయంలో చిరంజీవి వెళ్లి మోడీ టూర్లో పాల్గొనడం పట్ల కొంతమంది జనసైనికులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్‌ను పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఎండగడుతుంటే మెగాస్టార్ చిరంజీవి జగన్ మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చిరు వైఖరి తమకు ఇబ్బందికరంగా మారిందనేది వారి అభిప్రాయం. అయితే ఈ అసంతృప్తిని లోలోపలే అణుచుకుంటున్న జనసేన.. పవన్ కళ్యాణ్, చిరంజీవి రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నారని.. అందువల్ల చిరంజీవి ఎవరితో కలిసిన తమకు అభ్యంతరం లేదని మాత్రం బయటకు చెబుతోంది.
అయితే చిరంజీవి పార్టీ మార్పు మీడియా సృష్టి తప్ప అలాంటి వాతావరణం లేదని.. ప్రధాని పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానం అందింది కాబట్టే చిరంజీవి అక్కడికి వెళ్లారని పొలిటికల్ పార్టీలు చెప్తున్నాయి. చిరంజీవి పార్టీ మార్పుతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఏం మారవని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. ఏపీ పాలిటిక్స్‌లో క్రియాశీలకంగా లేని మెగాస్టార్ మళ్ళీ ఏపీ రాజకీయాలలో సెంటర్ పాయింట్‌గా మారడం కష్టమేననేది పబ్లిక్ టాక్. అంతేకాకుండా.. సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిన చిరంజీవి ఇప్పట్లో పొలిటికల్ కెరీర్‌ను టచ్ చేసే ధైర్యం కూడా చేసే అవకాశాల్లేదనేది పబ్లిక్ టాక్ సారాంశం. వచ్చే ఎన్నికల్లో చిరు ఏ పార్టీలో ఉన్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఎలాగూ లేనందున.. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మార్పు లేకుండా తటస్థంగా ఉండడమే చిరుకు మంచిదనేది అనలిస్టుల సూచన. పబ్లిక్ టాక్, విశ్లేషకుల అభిప్రాయాలు ఎలా ఉన్నా.. చిరంజీవి (Chiranjeevi) మనసులో ఏముందనేది మాత్రం ఆయనకే తెలియాలి.
Also read : Heavy Rains in Telangana : తెలంగాణకు అతి భారీ వర్ష సూచన.. కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook