CM Jagan Speech at Amaravati Meeting: అమరావతిలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్‌డీఏలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం కృష్ణాయపాలెం లేఅవుట్‌లో పైలాన్‌ను ఆవిష్కరించారు. ఆ తరువాత వన మహోత్సవంలో భాగంగా సీఎం జగన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. నిజంగా ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రత్యేకతగా ఎప్పటికీ నిలిచిపోయే రోజు అవుతుందని అన్నారు. పేదల శత్రువులతో ఎంతో సంఘర్షణ తర్వాత ఎన్నెన్నోఅవరోధాలు అధిగమించి ఈరోజు ఈ కార్యక్రమం పేదల విజయంతో జరుగుతోందన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించి ఇవ్వకుండా ప్రబుద్ధులు అడ్డు తగిలారని.. పేద వాడికి ఒక ఇళ్లు రాకూడదు, ఇంటి స్థలం రాకూడదని అడ్డుకొనే ప్రయత్నం చేశారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా హైకోర్టుకు వెళ్లారని.. ఇళ్లు రాకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్లిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఒక్క మన రాష్ట్రంలో చూస్తున్నామన్నారు. చంద్రబాబు, గజదొంగ ముఠా, పేదల వ్యతిరేకులంతా హైకోర్టులో 18, సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారని చెప్పారు. మూడేళ్లపాటు వీళ్లు వేసిన కేసులను పరిష్కరించేందుకు పోరాటం చేస్తూ వచ్చామన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేసులు గెలిచి అనుమతులు తెచ్చుకొని ఇళ్ల పట్టాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు.
"ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపలేకపోయారు కాబట్టి ఇళ్లు నిర్మాణం కూడా అడ్డుకొనేందుకు ప్రయత్నాలు చేశారు. కేంద్ర ప్రభుత్వంలో వీరు ఎక్కని గడప లేదు. దిగని గడప లేదు. కలవని కేంద్ర సెక్రటరీ కూడా లేడు. ఇంత మంది కలిసి చివరి ప్రయత్నంగా మళ్లీ హైకోర్టులో కేసు వేశారు. దేవుడి దయతో అన్నింటినీ అధిగమించి అడుగులు ముందుకు వేశాం. మీ ఇంటి కలల సాకారానికి ఈరోజు ఇక్కడే పునాదులు కూడా వేస్తున్నాం. ప్రతి విషయంలోనూ కూడా మన పేదల ప్రభుత్వానికి, చంద్రబాబు పెత్తందారుల కూటమికి మధ్య యుద్ధం జరుగుతోంది. పేదవాడికి ఏ మంచి జరిగినా అడ్డుకొనే రాక్షస బుద్ధితో మనం ఈరోజు యుద్ధం చేస్తున్నాం.
పేద పిల్లలకు గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం పెడుతున్నప్పుడు పెత్తందార్లంతా అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. పెత్తందార్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను మాత్రం ఇంగ్లిష్ మీడియం బడులకు పంపిస్తారు. మన పిల్లలు మాత్రం తెలుగు బడులకు పోవాలి అంటారు. తెలుగు భాష ఏమవుతుందని చెప్పి ముసలి కన్నీరు కారుస్తారు. ప్రతి అడుగులోనూ వారిది ఇదే ఆలోచన.
ఇదే అమరావతిలో పేరుకేమో రాజధాని అంటారు. ఇలాంటి రాజధానిలో నిరుపేదలకు, నా అక్కాచెల్లెళ్లకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామంటే అడ్డుకొనేందుకు కోర్టులకు వెళ్లారు. పేదలకు ఇళ్లు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాల్స్ వస్తుందట.. కులాల సమతుల్యం దెబ్బతింటుందని వాదించిన చరిత్ర వీళ్లది. ఇలాంటి పెత్తందారులు, ఈరోజు ఇలాంటి వ్యవస్థతో మనం యుద్దం చేస్తున్నాం. ఇలాంటి దుర్మార్గమైన మనషుల్ని, మనస్తత్వాల్ని, వాదనల్ని, రాతల్ని, టీవీ డిబేట్లను, రాజకీయ పార్టీల్ని మానసిక, నైతిక దివాళాను గతంలో ఎప్పుడైనా మనం చూశామా..?" అని సీఎం జగన్ ప్రశ్నించారు.
ఇక నుంచి ఈ అమరావతి మనందరి అమరావతి కాబోతోందన్నారు. ఇదే ప్రాంతంలో 50793 మంది మహిళలకు వాళ్ల పేరు మీదనే ఇళ్ల స్థలాలు ఇచ్చామని తెలిపారు. ఇక్కడి పేదలంతా కూడా ప్రభుత్వమే ఇళ్లు నిర్మించాలని అడిగారని అన్నారు. మంగళగిరి, తాడికొండ పరిధిలో 1400 ఎకరాల్లో 25 లేఅవుట్లలో అభివృద్ధి చేసి అక్కాచెల్లెమ్మలకు ఇళ్లస్థలాలు, ఇళ్లు నిర్మించే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పారు. అభివృద్ధిలో భాగంగా ల్యాండ్ లెవలింగ్, ప్లాట్ల సరిహద్దురాళ్లు పాతామని.. 56 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు.
Also Read: Bank Holiday August 2023: ఆగస్టు నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే..!
Also Read: Credit Card Rules: ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. పెరిగిన ఛార్జీలు ఇలా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి