వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలను ఆ ప్రాంత ఎమ్మెల్యే దారుణంగా మోసం చేశారని ఆయన తెలిపారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచి రూ.30 కోట్లకు అమ్ముడైపోవడం ఆ ఎమ్మెల్యేకే చెల్లిందని జగన్ అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తాను తొలుత జగ్గంపేటలోనే ప్రకటించానని జగన్ తెలియజేశారు.
జగ్గంపేటలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏలేశ్వరం ఆయకట్టు ఆధునీకరణకు వైఎస్ హయాంలోనే నిధులు కేటాయించడం జరిగిందని జగన్ అన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పరిస్థితులన్నీ రైతులకు వ్యతిరేకంగా మారిపోయాయని.. తెలుగుదేశం ప్రభుత్వం కనీసం ప్రాజెక్టుకు సంబంధించి 30 శాతం పనులు కూడా చేయలేదని.. ఇదే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అని జగన్, చంద్రబాబును దుయ్యబెట్టారు. చెరువులు తవ్వుకొని అమ్ముకోవడమే టీడీపీ నేతలకు ఇక్కడ నిత్య కార్యక్రమం అయిపోయిందని జగన్ విమర్శించారు.
చంద్రబాబు పెంచి పోషిస్తున్న జన్మభూమి కమిటీలు నిజానికి మాఫియా ముఠాలకు తీసిపోవని జగన్ అభిప్రాయపడ్డారు. నాలుగేళ్ల తెలుగుదేశం పాలన ప్రజల్లో ఎంతో భయాన్ని నింపిందని అన్నారు. కాపులకు కూడా చంద్రబాబు చేసింది ఏమీ లేదని.. తానే కనుక అధికారంలోకి వస్తే కాపులకు ఇచ్చే నిధులు పెంచాలని భావిస్తున్నానని జగన్ అన్నారు. ప్రతీ కాపు కూడా తనకు సోదరుడితో సమానమన్నారు. 222వ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలన అరాచకాలకు కేరాఫ్ అడ్రసుగా మారిందని జగన్ అన్నారు.