సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాను మూడు పెళ్లి చేసుకోవడంపై వస్తోన్న విమర్శలపై స్పందిస్తూ తనని విమర్శించిన వారిపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కా, చెల్లెళ్లు, ఆడపడుచుల మధ్య పెరిగిన వాడిని. వాళ్లని గౌరవించే వ్యక్తిని. ఏదో నా కర్మ కొద్దీ మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందే కానీ ఒళ్లు పొగరెక్కి కాదు అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ పోరాట యాత్రలో భాగంగా సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన భారీ బహిరంగ సభలో పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను బయటెలా ఉంటానో లోపల అలాగే ఉంటాను. లోపల ఒకలా బయట మరొకలా ఉండటం తనకు రాదు. చాలామంది పవన్ కల్యాణ్ అంటే సినిమా యాక్టర్ కదా అని అనుకుంటారు కానీ తాను మాత్రం లోపల ఓ గదిలో ఓ మూలకు కూర్చుని పుస్తకాలు చదవడం, ప్రజా సమస్యలపై ఆలోచించడం, ఎవరో ఒకరితో మాట్లాడుతుండటం చేస్తుంటాను. తన జీవితంలో పార్టీలు, పబ్బులు లాంటివి ఉండవు. అలాంటప్పుడు ఎవరు మాత్రం తనతో సుఖంగా ఉండగలరు. అందుకే వాళ్లు వెళ్లిపోయారు అంటూ తన మూడు పెళ్లిళ్ల వెనుకున్న పరిస్థితి ఇది అంటూ వివరించారు.
అయినా తానేమో ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంటే.. వాటికి సమాధానం చెప్పలేని వాళ్లు పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ సంబంధం లేని విమర్శలు చేస్తున్నారు. అదెలా కరెక్ట్ అవుతుందో వాళ్లకే తెలియాలి అని చెబుతూ.. ఒక పెళ్లి చేసుకుని మీలాగా బలాదూర్ తిరిగే వ్యక్తిని కాదు. అందుకే దాపరికం లేకుండా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను అని పవన్ కాస్త ఘాటుగానే జవాబిచ్చారు.