ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షం లేకుండా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ పూర్తి స్థాయిలో సభను బహిష్కరించడం ఏపీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు బహిష్కరించడమంటే సభను అవమానించడమేనని.. వైసీపీ తీరు ప్రజా సమస్యలను పరిష్కరించే పవిత్ర వేదికైన అసెంబ్లీని కించపరిచే విధంగా ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరో వైపు వైసీపీ వాదన మరో విధంగా ఉంది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి .. రాజకీయ విలువలను చంద్రబాబు కాలరాశారని ..పార్టీ మారిన వారిని అనర్హులుగా ప్రకటించే వరకు సభకు తాము హాజరుకాబోమని వైసీపీ స్పష్టం చేసింది.
అసెంబ్లీని జగన్ అవమానిస్తున్నారు - చంద్రబాబు
వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంపై చంద్రబాబు స్పందిస్తూ ..తన 40 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ జీవితంలో ప్రధాన ప్రతిపక్షం ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం తాను ఎప్పుడూ చూడలేదని.. విపక్షమే లేని అసెంబ్లీని చూడటం ఇదే మొదటి సారి అని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల నష్టం వైసీపీకే కానీ.. ప్రజలకు ఏమాత్రం నష్టం ఉండబోదన్నారు. ప్రతిపక్ష పార్టీ సమావేశాలను బహిష్కరించిన నేపథ్యంలో ప్రతిపక్ష బాధ్యతను తమే తీసుకొని ప్రజల పక్షాన నిలుస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
విలువలను చంద్రబాబు కాలరాస్తున్నారు -జగన్
అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ అంశంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ స్పందిస్తూ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి .. రాజకీయ విలువలను చంద్రబాబు కాలరాశారని ..పార్టీ మారిన వారిని అనర్హులుగా ప్రకటించే వరకు సభకు తాము హాజరుకాబోమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. గోడదూకిన వారిపై చర్యలు తీసుకుంటేనే సభకు హాజరవుతామని స్పీకర్ కు నివేదిక ఇచ్చమన్నారు. విపక్షం లేకుపోయినా ఫర్వాలేదనే రీతిలో తప్పులను కప్పిపుచ్చుకునే ధోరణిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని..ఏకపక్షంగా సాగే ఈ సమావేశాలకు ఈ మాత్రం ప్రాధాన్యం ఉండబోదని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి టీడీపీ విమర్శలకు బదిలిచ్చారు.