Pawan Kalyan comments on YS Jagan : విశాఖ: గాజువాకలో ఆదివారం నాడు జరిగిన వారాహి యాత్ర సభలో పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ సర్కారుపై, ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారాహి యాత్రలో తనకు ప్రేమతో స్వాగతం పలికిన గాజువాక నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెప్పిన పవన్ కళ్యాణ్.. గాజువాకలో నిజంగా తాను ఓడిపోయినట్టు అనిపించదు అని అన్నారు. గాజువాకను ఇప్పటికీ తన నియోజకవర్గంగానే భావిస్తానన్న పవన్.. జగన్ లాంటి వ్యక్తి గెలిచి, తాను ఓడుపోవడం దేనికి సంకేతం అని నియోజకవర్గ ప్రజలను ప్రశ్నించారు. ఓడిపోయినప్పటికీ ఓడిపోయాను అని పారిపోకుండా ప్రజల కోసమే నిలబడతాను అని అన్నారు.
అన్యాయాన్ని అరికట్టడానికే రాజకీయాల్లోకి వచ్చాను. జనసేన ఆశయం ఓడిపోలేదు. ఉత్తరాంధ్ర నుండే తాను పోరాటం నేర్చుకున్నానన్న పవన్ కళ్యాణ్.. 2024 ఎన్నికల్లో జనసేన జండా గాజువాకలో ఎగురుతుంది అని ధీమా వ్యక్తంచేశారు. ఏపీకి విశాఖ స్టీల్ ఫ్లాంట్ చాలా కీలకం. ముఖ్యంగా విశాఖ వాసులకు ఉపాధి పరంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఎంతో ముఖ్యమైనది అని అన్నారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని గుర్తుచేస్తూ.. విశాఖ స్టీల్ ఫ్లాంట్ కోసం భూమిలిచ్చిన రైతులు దేవాలయాల్లో ప్రసాదాలు తింటూ బతుకులు వెళ్లదీయడం బాధాకరం అని ఆవేదన వ్యక్తంచేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో విశాఖ వాసులకు ఎంత అన్యాయం జరుగుతున్నప్పటికీ.. సీఎం జగన్ స్టీల్ ఫ్లాంట్పై ఒక్క మాట కూడా మాట్లాడరు. విశాఖ ఎం.పి ఒక రౌడీషీటర్ అని స్థానిక ఎంపీపై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్.. విశాఖ స్టీల్ ఫ్లాంట్ పై 30 మంది ఎం.పిల్లో ఒక్కరూ ఒక్క మాట కూడా మాట్లాడరు అని మండిపడ్డారు. వైసీపీ ఎంపీలు మాట్లాడితే ప్రధానమంత్రి ఎందుకు వినరు అని ప్రశ్నించారు. కేసులు ఉన్నవాడికి కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం ఎలా వస్తుంది అని ఎద్దేవా చేస్తూనే.. రుషికొండ విద్వంసం చేసే ధైర్యం ఎలా వస్తుందని నిలదీశారు.
ఉత్తరాంధ్రాలో వైసీపీ ప్రభుత్వం దోపీడికి పాల్పడుతోందని ఆరోపించిన పవన్ కళ్యాణ్.. క్రైస్తవ సంఘం భూములు దోచేస్తున్నారు. దసపల్లా, సిరిపురం, రుషికొండ భూములతో పాటు ఉత్తరాంధ్రాలోని ఇతర విలువైన భూములను దోచేస్తున్నారు అంటూ మండిపడ్డారు. తెలంగాణలో ఏపీ ప్రజలకు అన్యాయం జరిగితే ,జగన్ ఎందుకు మాట్లాడడం లేదో అర్థం కావడం లేదు అని విస్మయం వ్యక్తంచేశారు. తనకు కుదిరితే విశాఖను తన రెండో ఇంటిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెబుతూ తనని ఆశీర్వదించడం ఇక మీ చేతుల్లోనే ఉందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.
పోలీస్ శాఖకు వాస్తవానికి ఎప్పుడు సొంత అభిప్రాయం ఉండదు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎలా చెబితే అలా నడుచుకోవడం జరుగుతోంది కానీ పోలీసులకు కూడా మనస్సు ఉంటుంది. పోలీసులకు చాలా కష్టాలు ఉన్నాయి. జనసేన పోలీసుల సమస్యలపై పోరాడుతుంది అని అన్నారు. అంతేకాకుండా జగన్ చేసే దోపిడీలకు, పోలీసులు రోడ్లు మీదకు రావల్సి వస్తోందన్నారు.