Petrol Price may hits 120 per litre in India: రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం నేటికి ఎనిమిదవ రోజుకి చేరుకుంది. ఈ ఉద్రిక్తత పరిస్థితుల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది. యుద్ధం ప్రారంభమైన తొలిరోజే భారత స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 111 డాలర్లకు చేరుకుంది. దాంతో చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
బుధవారం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 111 డాలర్లకు చేరింది. ఇది గత 8 ఏళ్లలో గరిష్టం. ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరగనుండటం కూడా చమురు ధరల పెరుగుదలకు ఓ కారణం అని చెప్పాలి. గత 2-3 రోజుల్లోనే చమురు ధర 15 శాతం పెరగడం గమనార్హం. సోమవారం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 98 డాలర్లుగా ఉండగా.. మంగళవారం 102 డాలర్లకు చేరింది. ఇక బుధవారం అయితే ఏకంగా 111 డాలర్లకాజు చేరింది. రానున్న రోజుల్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 115 నుంచి 125 డాలర్లకు కూడా పెరగొచ్చని సమాచారం తెలుస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నా.. భారత దేశంలో మాత్రం ప్రెటోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. గత 120 రోజులుగా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీ స్థాయిలో పెరిగినా.. మన దగ్గర పెరగపోవడానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడమే ఇందుకు కారణం. ఇప్పుడే పెంచితే.. ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత వస్తుందనే ఇప్పటివరకు ధరల పెంపు జోలికి వెళ్లలేదు.
ఇక మార్చి 7న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియనున్నాయి. దాంతో ఇప్పటివరకు చమురు ధరల భారాన్ని మోస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇకపై చేతులెత్తేయనుందట. చమురు మార్కెటింగ్ కంపెనీలు వచ్చే వారంలోనే పెట్రో ధరల పెంపును ప్రారంభిస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ లీటరుకు రూ.15 నుంచి రూ.20కి పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే పెట్రోలు ధర సుంకాలన్నింటితో కలిపి రూ.120 నుంచి 125కి చేరే అవకాశం ఉంది. అదే సమయంలో డీజిల్ ధరలు కూడా పెరగనున్నాయి. ఇది సామాన్యుడికి పెను భారం అని చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook