Man Attacked At Kerala Story Screening Theatre: మే 8న సాయంత్రం కాచిగూడలోని వెంకటరమణ థియేటర్లో కేరళ స్టోరీ సినిమా చూడ్డానికి వెళ్లిన తనకు పోలీసుల చేతిలోనే చేదు అనుభవం ఎదురైందంటూ హితేష్ శర్మ అనే యువకుడు హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. సినిమా చూడ్డానికి వెళ్లిన తనపై థియేటర్ మేనేజర్ అనీష్ మెహ్రాతో పాటు స్థానిక సీఐ రామ లక్ష్మణ్ రాజు, ఎస్సై పి రవి కుమార్, కానిస్టేబుల్ మోహన్ తో పాటు మరొక కానిస్టేబుల్ తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని హితేష్ శర్మ హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కి ఫిర్యాదులో పేర్కొన్నారు.
హితేశ్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం.. కేరళ స్టోరీ సినిమా కోసం రాత్రి 9-12 గంటల షో కోసం తన స్నేహితులు టికెట్ బుక్ చేశారని.. కానీ తాను సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి చేరుకోలేకపోవడంతో వారు లోపలికి వెళ్లిపోయారని.. రాత్రి 10. 30 గంటల సమయంలో తాను థియేటర్ కి వెళ్తే అక్కడ థియేటర్ మేనేజర్ క్యాబిన్లో నన్ను బట్టలూడదీసి కొట్టి చిత్ర హింసలు పెట్టడమే కాకుండా వారి మొబైల్ ఫోన్లలో తన ఫోటోలు కూడా తీసుకున్నారని హితేశ్ వాపోయారు. తన పేరు అడిగితే హితేశ్ శర్మ అని చెప్పానని.. మార్వాడి బ్రాహ్మిణ్వి కదా అని నిర్ధారించుకున్న తరువాత తన కులం పేరుతో దూషిస్తూ మరీ దాడికి పాల్పడ్డారని హితేశ్ ఆవేదన వ్యక్తంచేశాడు. ఆ సమయంలో " మీ అమ్మను " అంటూ తన తల్లిని. తన కులాన్ని కూడా దూషించారని హితేశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
పోలీసుల దాష్టికం అంతటితో ఆగలేదని.. రాత్రి 11.30 గంటల సమయంలో తనను సీఐ రామ లక్ష్మణ్ రాజు సిబ్బందితో కలిసి పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ కూడా బట్టలూడదీసి లాకప్ లో కూర్చొబెట్టారని.. ఏ తప్పు చేయని తనని ఎందుకు పోలీసు స్టేషన్ కి తీసుకొచ్చారని ప్రశ్నించగా.. తమకు సహకరించకుండా ఎక్కువ చేస్తే గంజాయి కేసులో ఇరికించి లోపల వేస్తామని బెదిరించారని హితేష్ పేర్కొన్నాడు. తన సెల్ ఫోన్ కూడా లాగేసుకుని, ఎవ్వరికీ ఫోన్ చేసే అవకాశం కూడా చేశారు. మరునాడు తనను 8వ స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అసలు ఏ కేసులో తనను కోర్టులో హాజరుపరిచారో కూడా తనకే తెలియదు. తన గోడును న్యాయమూర్తి ఎదుట వెళ్లబోసుకుందాం అనుకుంటే అక్కడ కోర్టులో రద్దీ ఉన్న కారణంగా రొటీన్ గానే తనకు జరిమానా విధించి పంపించారు అని హితేష్ వాపోయాడు.
అక్రమ కేసులో బనాయిస్తారనే భయానికి తోడు, పోలీసుల వద్ద తన సెల్ ఫోన్, ఇతర వస్తువులను తిరిగి తీసుకోవడం కోసం గత్యంతరం లేని పరిస్థితుల్లో అయోమయంగానే మౌనంగా ఉండిపోయాను. ఆ తరువాత వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాను. నిన్న 10వ తారీఖునే ఇదే విషయమై మిమ్మల్ని కలిసి ఫిర్యాదు చేసేందుకు వచ్చానని.. కానీ మిమ్మల్ని కలవలేకపోయానని తన ఫిర్యాదులో పేర్కొన్న హితేష్.. తనపై దాడికి పాల్పడిన సర్కిల్ ఇన్ స్పెక్టర్ రామ లక్ష్మణ్ రాజు, ఎస్సై పి రవి కుమార్, కానిస్టేబుల్ మోహన్ తో పాటు మరొక కానిస్టేబుల్ పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను అని అన్నారు. థియేటర్లో, పోలీసు స్టేషన్ లో తనపై దాడికి పాల్పడిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని భద్రపరిచేలా చర్యలు తీసుకోవడంతో పాటు తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలకు ఆదేశించాల్సిందిగా హితేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. హితేశ్ శర్మ ఇచ్చిన ఈ ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్ ఏమని స్పందించనున్నారో వేచిచూడాల్సిందే మరి.